Lok Sabha Election: భువనగిరి టికెట్ కోసం పెరుగుతున్న పోటీ.. తెరపైకి యువనేతలు.. గెలుపు ధీమాలో కాంగ్రెస్

హైదరాబాద్‌ను ఆనుకుని ఉండే పార్లమెంట్ సెగ్మెంట్. ఉత్తర – దక్షిణ తెలంగాణ ప్రాంతాలు కలగలిసిన ఏకైక నియోజకవర్గం. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ లోక్ సభ సీటు అన్ని పార్టీలకు ఎంతో ప్రత్యేకం. ఈ కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Lok Sabha Election: భువనగిరి టికెట్ కోసం పెరుగుతున్న పోటీ.. తెరపైకి యువనేతలు.. గెలుపు ధీమాలో కాంగ్రెస్
Bhongir Constituency
Follow us

|

Updated on: Dec 25, 2023 | 8:57 PM

భువనగిరి.. హైదరాబాద్‌ను ఆనుకుని ఉండే పార్లమెంట్ సెగ్మెంట్. ఉత్తర – దక్షిణ తెలంగాణ ప్రాంతాలు కలగలిసిన ఏకైక నియోజకవర్గం. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ లోక్ సభ సీటు అన్ని పార్టీలకు ఎంతో ప్రత్యేకం. ఈ కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే టికెట్ ఆశిస్తున్న వాళ్ల లిస్ట్.. ఒక్కో పార్టీలో చాంతాండ ఉందట. పలువురు యువనేతలతో పాటు.. బీసీ నేతలు ఈ సీటుపై కన్నేశారట. ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారట. ఇంతకీ ఈ ఎంపీ స్థానంలో ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వబోతోంది? ఏయే సమీకరణాలను పార్టీలు పరిగణలోకి తీసుకోబోతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించిన తర్వాత.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న భువనగిరి పార్లమెంటు స్థానంపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. దీంతో భువనగిరి పార్లమెంటు టికెట్ కోసం ప్రధాన పార్టీల్లో చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టుంది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ మినహా, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీ స్థానం తమ ఖాతాలోనే పడుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్. అటు బీజేపీ సైతం రేసులో నేనున్నా అంటోంది.

ప్రధాన పార్టీల్లో భువనగిరి టికెట్ కోసం యువనేతలు పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ టికెట్‌ రేసులో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై తుంగతుర్తిలో మందుల సామేల్‌ గెలుపు కోసం పనిచేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తానన్న విషయాన్ని కూడా మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెల్లారట. మరోవైపు సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇక బీసీ కోటాలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ ఎంపీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోద ర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న వెంకన్న కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీలో దింపుతారనే ప్రచారం కూడా కొనసాగుతోంది.

ఇక బీఆర్‌ఎస్ విషయానికి వస్తే భువనగిరి ఎంపీ స్థానాన్ని గత రెండు సార్లు బీసీకే ఇచ్చింది. ఈ సారి కూడా అదే ఫార్ములా అమలు చేయబోతున్నట్టు ప్రచారం. ఈ మేరకు బీసీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన జనగామకు చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాల్సి వస్తే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత భర్త మహేందర్ రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీళ్లతో పాటు జిట్టా బాలకృష్ణారెడ్డి పేరును కూడా హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉందని సీనియర్లు చెపుతున్నారు. శేఖర్ రెడ్డికి భువనగిరి పార్లమెంటు పరిధిలో బంధు వర్గంతో పాటు వివాద రహితుడు, సామ్యుడు అనే పేరుంది. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న పైళ్ల శేఖర్‌రెడ్డిని బరిలో నిలుపుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ, జనగామ మినహా ఆరుచోట్ల ఓడిపోవడంతో ఎంపీగా ఎవరిని దింపితే పార్టీకి కలిసివస్తుందనే దానిపై పార్టీకే క్లారిటీ లేదట.

ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో బూర నర్సయ్య గౌడ్‌ను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోందట.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. ఇక 2009లో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వేస్తున్న వ్యూహాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…