Big News Big Debate: మరో మహాయుద్ధం.. తెలంగాణ దంగల్ 2.0
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వేడి తగ్గకముందే ప్రదానపార్టీలకు పార్లమెంట్ సెగ తాకింది. ఓవైపు అభ్యర్ధుల ఎంపికపై ఫోకస్ చేస్తూనే.. ప్రత్యర్ధి పార్టీలపై మైండ్‌గేమ్ మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజారినా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో స్వీప్ చేసి సోనియాకు బహుమతిగా ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించగా.. బీజేపీ కూడా గల్లీలో ఎవరైనా.. ఢిల్లీలో మాత్రం మోదీయే అంటూ మెజార్టీ సీట్లపై కన్నుసింది.

పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును సుస్థిరం చేసుకోవాలని ఆరాటపడుతోంది కాంగ్రెస్. పడిలేచిన కెరటంలా సత్తా చాటాలనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. మోదీ మానియాతో మెజార్టీ సీట్లు గెలుచుకుని ప్రతిష్టను మరింత పెంచుకోవాలనుకుంటోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై రివ్యూ చేసిన కేటీఆర్.. కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ ఆదేశించారని.. గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు ఎంపీ రంజిత్‌రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని ఖాళీ అవుతుందని కాంగ్రెస్-బీజేపీలు అసత్యప్రచారం చేస్తున్నాయని.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు ఎంపీ రంజిత్‌రెడ్డి.
బీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదంటోంది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ప్రజలు గుణపాఠం చెప్పినా…బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు బండి సంజయ్. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతే అన్నారు బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి బండి. వంద రోజుల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలుపై సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందన్నారు బండి. మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు కదనరంగంలో దిగాయి. ఇంతకీ సీట్లు, ఓట్ల వేటలో ఎవరు లక్ష్యం చేరుకుంటారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…