పాలమూరులో పార్లమెంట్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచార జోరు పెంచారు. రెండు జాతీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య స్థానికత అంశం రచ్చ రేపుతోంది. లోకల్.. నాన్ లోకల్ ఫైట్ తో పాలమూరు ఎంపీ అభ్యర్థుల మధ్య ఫైట్ మొదలయ్యింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ప్రచారంలో ఈ అంశాలపైనే విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలకు పదును పెట్టారు. అయితే అంతే ధీటుగా డీకే అరుణ స్పందించడంతో పాటు తిరిగి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది.
పదే పదే విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్లు, అనుబంధం లేని వాళ్లు తనపై విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా వంశీచంద్ రెడ్డిని టార్గెట్ చేశారు డీకే అరుణ. తాను పాలమూరు ప్రజల కోసం కృషి చేసినట్లుగా ఎవరూ చేయలేదని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు నాంది పలికింది తానేనని తేల్చి చెప్పారు. అయితే డీకే అరుణ కామెంట్స్‌పై కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
గుజరాత్‌కు చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్నందున ఆయన నాన్ లోకలా అని ప్రశ్నించారు. అలాగే మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ నాన్ లోకలా చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ అయిన వారిద్దరికీ ఓట్లు వేయవద్దని డీకే అరుణ చెప్పాలి లేదంటే తనకు, మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇరువురి పోటా పోటీ విమర్శలతో ఎంపీ ఫైట్ కాస్త లోకల్ నాన్ లోకల్ చుట్టూ తిరుగుతోంది. ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ కు తన ఓటు ను మార్చుకునేలా చేశాయి ఈ విమర్శలు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుచరులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…