Telangana Elections: ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం.. తెలంగాణలో సీఎం ఫేస్ ఎవరంటే..
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించినప్పుడు ప్రజామోదం కూడా అందుకు తగ్గట్టే వచ్చినప్పుడు అనివార్యంగా ఆ నేత ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు సమావేశమై ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించే అధికారాన్ని అధిష్టానానికి అప్పగిస్తున్నట్టు తీర్మానిస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో..

దేశంలో ఒకప్పుడు పార్టీని చూసి జనం ఓటు వేసేవారు. ఆ తర్వాత స్థానిక అభ్యర్థిని చూసి ఓట్లు పడేవి. గతం దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా ‘లీడర్’ కేంద్రంగా ఓట్లు పడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ విషయంలో ఇప్పటికీ ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. గత రెండు పర్యాయాలు జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళిని గమనిస్తే.. మోదీని గెలిపించడం కోసం స్థానిక అభ్యర్థి ఎవరైన్నది చూడకుండా జనం ఓట్లేస్తూ వచ్చారు. ఇదే ట్రెండ్ కొన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో సీఎం కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఉద్యమనేతగా తెచ్చుకున్న గుర్తింపుతో 2014లో గెలుపొందగా.. 2018లో ఆయన పనితీరుతో మెప్పు పొంది మరిన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. స్థానిక అభ్యర్థి ఎవరన్నది చూడకుండా ఈ రెండు ఎన్నికల్లో జనం కేసీఆర్ కోసమే ఓట్లు వేసినట్టు స్పష్టమవుతోంది.
మరోసారి ఆయనే సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా బీసీ నేతను సీఎంను చేస్తామంటూ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ సీఎం ఫేస్ ఎవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. మరి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందా.. లేక ఎన్నికల్లో గెలిచిన తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటుందా? ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కల్గిస్తున్న అంశం.
ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్‌లో సీఎం అభ్యర్థులు వారే
కొన్ని సర్వేల అంచనాలతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నేతృత్వంలో ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ఆయనకే సీఎం సీటు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లో గెలిస్తే మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కే ముఖ్యమంత్రి పీఠం అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కానీ ఎటొచ్చీ రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. రాజస్థాన్‌లో ప్రస్తుత ఎన్నికల వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేతుల మీదుగానే సాగుతున్నప్పటికీ.. అక్కడ పార్టీ గెలిచిన తర్వాత ఆయనే సీఎంగా కొనసాగుతారని చెప్పలేకపోతోంది. సచిన్ పైలట్ రూపంలో పొంచి ఉన్న తిరుగుబాటు ముప్పే ఇందుకు కారణమా అన్న చర్చ జరుగుతోంది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో..
ఈ పరిస్థితుల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలిసింది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తుండగా.. రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల విషయంలో తేల్చకపోవడమే మంచిదని భావిస్తోంది. సాధారణంగా పార్టీ మరోసారి గెలిస్తే సిట్టింగ్ సీఎం కొనసాగుతారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులను మార్చిన సందర్భాలు సైతం లేకపోలేదు.
80వ దశకంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా అర్జున్ సింగ్ ఉన్న సమయంలో ఇదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో రాజీవ్ గాంధీని కలవడానికి వచ్చినప్పుడు, రాజీవ్ ఆయన్ను గవర్నర్‌గా పంపి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోతీలాల్ వోరాను నియమించారు. తాజాగా 2005లో సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ అధిష్టానం అధికార పగ్గాలను విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు అప్పగించింది. ఈ తరహాలో రాజస్థాన్‌లో కూడా జరగవచ్చని, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చినా సరే.. ఆయన్ను సీఎంగా కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చని ఏఐసీసీలో జోరుగా చర్చ జరుగుతోంది.
సచిన్ పైలట్ సారథ్యంలో..
గత అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్ సారథ్యంలో పార్టీ గెలుపొందినప్పటికీ.. ఆయనకు సీఎం పదవి దక్కలేదు. సీఎం సీటుపై కన్నేసిన ఆయన మధ్యలో ఓసారి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేసినప్పటికీ, గెహ్లాట్ చాతుర్యంతో ఆ ముప్పు నుంచి తప్పించుకోగలిగారు. సచిన్ పైలట్‌ను శాంతింపజేసేందుకు అధిష్టానం పెద్దలు ఇచ్చిన హామీలేంటి అన్నవి బయటి ప్రపంచానికి తెలియకపోయినా.. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని గెహ్లాట్‌కు అప్పగించే ఉద్దేశంతో ఆయన్ను సీఎం పదవి నుంచి కదిలించే ప్రయత్నం అధిష్టానం చేసింది.
కానీ ఆయన అధిష్టానం పెద్దలకే ఝలక్ ఇస్తూ సీఎం సీటును వదలకుండా పట్టుకుని కూర్చున్నారు. ఈ చర్య అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పించినప్పటికీ, అప్పటికప్పుడు ఏమీ చేయలేక మౌనాన్ని ఆశ్రయించింది. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత అధిష్టానం నిర్ణయించినట్టే జరుగుతుందన్నది ఏఐసీసీ వర్గాల చర్చల సారాంశం.
తెలంగాణలో ఆ సీటుపై 10 మంది కన్ను
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించినప్పుడు ప్రజామోదం కూడా అందుకు తగ్గట్టే వచ్చినప్పుడు అనివార్యంగా ఆ నేత ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు సమావేశమై ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించే అధికారాన్ని అధిష్టానానికి అప్పగిస్తున్నట్టు తీర్మానిస్తూ ఉంటారు. తద్వారా ఢిల్లీ నుంచి వెళ్లే సీల్డ్ కవర్ ద్వారా సీఎం ఎవరన్నది నిర్ణయించిన సందర్భాలు కూడా కోకొల్లలు. సీఎం పదవి ఎవరిని వరించినా.. వారిని వ్యతిరేకించే వర్గం కూడా కాంగ్రెస్‌లో సిద్ధంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలను కలుస్తూ సీఎంపై ఫిర్యాదులు చేస్తూ ఆ సీటు నుంచి దింపే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటుంది.
తెలంగాణ విషయంలో మాత్రం..
ఈ సంగతెలా ఉన్నా.. తెలంగాణ విషయంలో సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేయలేదు. కానీ రాష్ట్ర నాయకత్వంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ – ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి).. ఇంకా చాలా మంది సీఎం రేసులో తాము ఉన్నామని చాటుకుంటున్నారు. నిజానికి అంతర్గతంగా నేతల మధ్య ఎన్ని విబేధాలున్నా.. కర్ణాటకలో ఫలించిన ఐక్యతా మంత్రాన్ని ఇక్కడ కూడా జపిస్తూ.. నేతలంతా పైకి కలసికట్టుగా పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
అంతర్గతంగా ఇప్పటి నుంచే సీఎం పదవి కోసం అధిష్టానం పెద్దల వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. ఈ విబేధాలు, గ్రూపులను దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం సీఎం అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించకుండా వ్యూహాత్మకంగా మౌనం ప్రదర్శిస్తోంది. ఒకవేళ ముందే ప్రకటిస్తే.. సీఎం సీటు ఆశిస్తున్న మిగతా నేతలంతా సహాయ నిరాకరణ చేయడమే కాదు, తనకు దక్కని పదవి ఎవరికీ దక్కకుండా చేయాలన్న గెలుపు అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నాలు సైతం చేయవచ్చు. అందుకే అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
ముందు గెలుపొందితే చాలు.. సీఎం ఎవరన్నది తర్వాత చూసుకోవచ్చు అన్న ధోరణిని అవలంబిస్తోంది. ‘లీడర్’ కేంద్రంగా జనం ఓట్లేస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తుందా.. బెడిసికొడుతుందా అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
