పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా ఒక్కట య్యారు. తలా కొంత కలిసి జమచేసిన డబ్బును కుటుంబానికి అందించి మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి) వాసులు. వివరాల్లోకి వెళితే.. కిర్గుల్ (బి)కు చెందిన కరాండె గోదావరి, గంగన్న దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. గంగన్న గ్రామంలో పారి శుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గోదావరి కూలీ పనులకు వెళ్తుంది. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇటీవల పెద్ద కూతురు వివాహం కుదిరింది. మే 7న వివాహ ముహూర్తం నిశ్చయించారు. ఉన్నంతలో ఘనంగా వివాహం చేద్దామనుకున్నారు. తెలిసిన వారి వద్ద అప్పుచేసి బంగారం, పెళ్లి సామగ్రి కొని ఇంట్లో సిద్ధంగా పెట్టుకున్నారు.
రోజులాగానే బుధవారం రాత్రి భోజనం చేసి, ఓ గదిలో అందరూ నిద్రపోయారు. అర్ధ రాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు వారు పడుకున్న గదికి గడియపెట్టి మరో గది లోని బీరువాలో ఉన్న రూ. 50 వేల నగదు, రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం నిద్రలేచి చూసే సరికి ఇల్లు గుల్లయింది. వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా నగదు, సొమ్ము దొంగలు ఎత్తుకెళ్లడంతో గంగన్న, గోదావరి దంపతులు బోరున విలపిస్తున్నారు. వీరి దీనస్థితి అర్ధం చేసుకున్న గ్రామస్తులు తామున్నామని అండగా నిలిచారు. యువకులు ఇంటింటికీ తిరిగి రూ.1,50,000 సేకరించి బాధిత కుటుంబానికి అందించారు. వీడీసీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి రూ.90,000 వేలు, సర్పంచ్ సుధాకర్రెడ్డి రూ.50,000 వేలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. దీంతో గంగన్న, గోదావరి దంపతులు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…