Khanapur Election Result 2023: ఖానాపూర్‌లో గెలిచేది ఎవరు..? త్రిముఖ పోరులో ధీరులెవరూ..?
Khanapur Assembly Election Result 2023 Live Counting Updates: ఖానాపూర్ నియోజక వర్గంలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గులాబీ పార్టీ ముచ్చటగా మూడవసారి సైతం గెలుపును అందుకుంటుందా..? ఖానాపూర్ ను కారుకు కంచుకోటగా మారుస్తుందా..? ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిది..?

పోరాటాల పురిటిగడ్డ ఇంద్రవెళ్లి.. టైగర్ జోన్ పులుల ఖిల్లా కవ్వాల్.. ఆదివాసీల ఇలవేల్పు నాగోబా.. పచ్చని అడవులు.. అంతే స్వచ్చమైన మనుషులు.. అన్నీ కలగలిపితే ఖానాపూర్ నియోజక (Khanapur Assembly Election) వర్గం. దేశంలోనే రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ప్రాంతమిది. ఆదివాసీ గిరిజనులు అదికంగా ఉన్న నియోజక వర్గం కూడా ఇదే. పచ్చని పంటలకు సాగు నీరందించే కడెం.. తలాపున గోదావరి.. తరగని కలప సంపద ఖానాపూర్ నియోజక వర్గ సొంతం. రాజకీయ పోరాటానికి సైతం కేరాఫ్ అడ్రస్ ఖానాపూర్. ఆదివాసీలు అస్తిత్వం కోసం పోరు సలిపింది కూడా ఇక్కడి నుండే..
లోకల్ వర్సెస్ నాన్ లోకల్ , ఆదివాసీ వర్సెస్ లంబాడా ఇప్పుడు ఈ రెండు నినాదాలే పొలిటికల్ గా ఖానాపూర్ నియోజక వర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. మరి ప్రజల మాటేంటి.. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాదించిన గులాబీ పార్టీ ముచ్చటగా మూడవసారి సైతం గెలుపును అందుకుంటుందా..? ఖానాపూర్ ను కారుకు కంచుకోటగా మారుస్తుందా..? సిట్టింగ్ ఎమ్మెల్యే రాఖా నాయక్‌కు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించింది దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా భూక్య జాన్సన్ రాథోడ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మద్ధతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మ బొజ్జు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ బరిలో నిలుస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంటోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
ఈ నియోజక వర్గంలో 2,20,526 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 1,12,212 మంది ఉండగా, పురుషులు 1,08,400 మంది ఉన్నారు. నియోజక వర్గంలో ఆదివాసీ ఓటర్లు 33 శాతం ఉంటే.. లంబాడీల ఓట్ల శాతం 21.. బీసీల్లో మున్నురుకాపు ఓటర్ల సంఖ్య 15 శాతం.. ఆ తరువాత 10 శాతంతో పద్మశాలిలు నియోజక వర్గంలో టాప్ లో ఉన్నారు. మిగిలిన 21 శాతం బీసీ , ఎస్సీ , మైనార్టీలున్నారు. ఆదివాసీ , మున్నూరు కాపులు ఎటు వైపు మొగ్గు చూపితే వారిదే విజయం అన్నది ఇక్కడ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఇక్కడ 78.18 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 73.29 శాతం, 2018 ఎన్నికల్లో 80.5 శాతం పోలింగ్ నమోదయ్యింది.
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆజ్మీరా రేఖా నాయక్ 20,710 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో రేఖా నాయక్‌కు 67,138 ఓట్లు పోల్ కాగా.. రమేష్ రాథోడ్‌కి 46,428 ఓట్లు దక్కించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ 38,511 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్‌పై విజయం సాధించారు. రేఖా నాయక్‌కు 67,442 ఓట్లు దక్కగా.. రితేష్ రాథోడ్‌కి 28,931 ఓట్లు పోల్ అయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
