Khammam: మృత్యు లారీలు.. రోడ్ టెర్రర్‌లో ఆరుగురు దుర్మరణం.. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా..
Khammam News: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనల్లో లారీలే ప్రధాన కారణంగా ఉన్నాయి..
Khammam News: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనల్లో లారీలే ప్రధాన కారణంగా ఉన్నాయి.. దీంతో ఖమ్మంలో విషాదం నెలకొంది. మొదటి ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్లలో జరిగింది. కొణిజర్ల దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులుగా గుర్తించారు. మృతులు పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, వారి కుమారుడు అశ్విత్ 13 గా గుర్తించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్.. వైరా మండలం విప్పలమడక.. స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా మృత్యువు కబళించింది. దీంతో విప్పలమడకలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో ఘటనలో జిల్లాలోని పెనుబల్లి వీఎం బంజర జరిగింది. బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు లారీల డ్రైవర్లిద్దరూ ఇరుక్కుపోయారు. బయటికి రాలేక, ఊపిరి ఆడక రెండు గంటలపాటు నరకం చూశారు. పోలీసులు.. రెస్క్యూ టీం సాయంతో వారిని రెండుగంటల తరువాత బైటికి తీశారు. కానీ తీవ్రంగా గాయపడడం, ఊపిరిఆడకపోవడంతో బైటికి తీసిన కాసేపటికే వీరిద్దరూ మృతి చెందారు.
మూడో ఘటన కల్లూరు మండలం రంగంబంజరలో చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజ అనే యువకుడు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీలు యమపాశాలుగా మారడంతో మూడు ఘటనల్లో మొత్తం ఆరుగురు మరణించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..