‘నా మృతదేహాన్ని భారత్‌కు తరలించండి’.. చావుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న ఖమ్మం జిల్లా వాసి

ప్రాణాంతక వ్యాధి తనను హరిస్తోందని తెలిసీ తన మరణం తర్వాత జరగాల్సిన ఏర్పాట్లను బాధ్యతతో ముందే చేసేశాడు. జీవిత భాగస్వామి, కన్నవాళ్లను ఓదార్చాడు. తన మృతదేహాన్ని విదేశం నుంచి స్వదేశంలోని ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఊహించినట్లుగానే ఆ రోజు వచ్చింది..

'నా మృతదేహాన్ని భారత్‌కు తరలించండి'.. చావుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న ఖమ్మం జిల్లా వాసి
Khammam Man Died In Australia
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 06, 2023 | 12:13 PM

ప్రాణాంతక వ్యాధి తనను హరిస్తోందని తెలిసీ తన మరణం తర్వాత జరగాల్సిన ఏర్పాట్లను బాధ్యతతో ముందే చేసేశాడు. జీవిత భాగస్వామి, కన్నవాళ్లను ఓదార్చాడు. తన మృతదేహాన్ని విదేశం నుంచి స్వదేశంలోని ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఊహించినట్లుగానే ఆ రోజు వచ్చింది. అనారోగ్యంతో చనిపోయిన తర్వాత సొంతూరులో దహనసంస్కారాలు జరిగాయి. కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న మన ఖమ్మం జిల్లా వాసి కథ ఇది.

ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌ (33), రెండో కుమారుడు అఖిల్‌. హర్షవర్ధన్‌ బీ-ఫార్మసీ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ యూనివర్సిటీలో హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మెడిసిన్‌ పూర్తి చేసి ఓ ప్రైవేటు వైద్యశాలలో డాక్టర్‌గా పనిచేస్తుండేవాడు. ఉద్యోగం వచ్చాక హర్ష వర్ధన్‌ 2020లో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా రాగానే భార్యను తీసుకెళ్తానని చెప్పి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. పెళ్లైన కొన్ని నెలలకే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకినట్లు హర్షవర్ధన్‌కు తెలిసింది. ఇంటికి తిరిగి రమ్మని తల్లిదండ్రులు కోరితే ఇక్కడే మంచి చికిత్స లభిస్తుందని నచ్చజెప్పాడు. వాస్తవం వేరని అతనికి తెలుసు. తనకొచ్చిన వ్యధి నయమయ్యేది కాదని, చావు తప్పదని తెలిసిన ఆ యువకుడు ముందుగా భార్యకు విడాకులిచ్చి, ఆమె స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు.

ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులకు ధైర్యం చెప్పాడు. తాను మరణించాక మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మరణం సమీపించే కొద్దీ వీడియోకాల్‌ చేసి కన్నవారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 24న కన్నుమూశాడు. హర్షవర్ధన్‌ మృతదేహం బుధవారం ఉదయం ఖమ్మంలోని అతని ఇంటికి చేరింది. కుమారుడి మృతదేహం చూసుకుని తల్లిదండ్రులు, బంధువులు, ఊరుఊరంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ తర్వాత హర్షవర్ధన్‌ కోరుకున్నట్లుగానే దహనసంస్కారాలు జరిపించారు. బాధను దిగమింగి, ఎంతో బాధ్యతతో వ్యవహరించిన హర్షవర్ధన్‌ కథనం ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.