Telangana: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ అంటే ఇట్లా ఉంటది.. 9999 నంబర్ ఎంత పలికిందో తెలుసా..?
హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నంబర్లకు పెరుగుతున్న క్రేజ్‌ను ఖైరతాబాద్ RTA వేలం స్పష్టం చేసింది. 9999 నంబర్ 18 లక్షలకు అమ్ముడుపోగా, మొత్తం రూ.43.5 లక్షలు ఆదాయం సమకూరింది. వాహనదారులు అదృష్ట సంఖ్యల పట్ల చూపిస్తున్న ఆసక్తి కారణంగానే ఈ రికార్డు ధరలు పలికాయి.

కొందరికీ ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా ఇష్టం. తమ వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైన ఖర్చు పెట్టేందుకు వెనకాడరు. లక్షలు ఖర్చు పెట్టిన ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకుంటారు. ప్రస్తుతం భాగ్యనగర వాసులకు ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో రికార్డు ధరలు పలికాయి. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.43.5 లక్షలు ఆదాయం వచ్చింది.
9999 నెంబర్ కోసం పోటాపోటీ
ఈ వేలంలో అన్నిటికంటే ప్రధాన ఆకర్షణగా నిలిచిన TG 09 J 9999 నెంబర్ రికార్డు ధర పలికింది. ఈ నెంబర్ కోసం భారీ పోటీ నెలకొనగా చివరికి కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 18,00,000 దీనిని దక్కించుకుంది.
వేలంలో ఇతర ఫ్యాన్సీ నెంబర్లు కూడా భారీ ధరలకే అమ్ముడయ్యాయి:
- TG 09 K 0006: ఈ నెంబర్‌ను అనంతలక్ష్మి కుమారి రూ. 7,06,666 చెల్లించి సొంతం చేసుకున్నారు.
- TG 09 K 0005: నేహా అగర్వాల్ రూ.1,89,001 కు ఈ నెంబర్ పొందారు.
- TG 09 J 9909: సాయి వెంకట్ సునాగ్ పాలడుగు రూ.1,44,999 వెచ్చించారు.
- TG 09 K 0009: శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రూ.1,00,000కు ఈ నెంబర్ పొందింది.
- TG 09 K 0001: ఇషాని కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,00,000కు ఈ నెంబర్ దక్కించుకుంది.
వాహనదారులు తమ అదృష్ట సంఖ్యలు, ఫ్యాన్సీ నెంబర్ల పట్ల చూపిస్తున్న ఆసక్తి కారణంగానే ఈ స్థాయిలో పోటీ ఏర్పడిందని అధికారులు తెలిపారు.
9 నెలల్లో రూ.5142 కోట్లు
మరోవైపు 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి 9 నెలల్లో రవాణా శాఖకు భారీ ఆదాయం వచ్చింది. రూ.5142 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ ట్యాక్స్ ద్వారా రూ.3611 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా 730 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా 57 కోట్లు, ఫీజుల ద్వారా 408 కోట్లు, తనిఖీల ద్వారా 181 కోట్లు, సర్వీస్ చార్జీల ద్వారా 153 కోట్లు సమకూరిందని రవాణా శాఖ తెలిపింది. 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 6165 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 5142 కోట్లు వచ్చాయని రవాణా శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
