Khairatabad Election Result 2023: ఖైరతాబాద్ నియోజకవర్గంలో మళ్లీ గెలిచిన దానం
Khairatabad Assembly Election Result 2023 Live Counting Updates: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున దానం నాగేందర్ మళ్లీ బరిలో నిలిచారు. పీజేఆర్ కుమార్తె పి విజయ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా... బీజేపీ నుంచి చింతల రామచంద్రా రెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. అయితే బీఆర్‌ఎస్‌నే ఓటర్లు ఆదరించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఖైరతాబాద్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో (Khairatabad Assembly Election) 2,96,014 మంది ఓటర్లు ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మళ్లీ ఆ నియోజకవర్గ బరిలో నిలిచారు. పీజేఆర్ కుమార్తె పి విజయ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి బరిలో నిలిచారు. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో 52.07 శాతం పోలింగ్ నమోదయ్యింది.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినా.. ఇక్కడ మాత్రం బీఆర్‌ఎస్‌నే ప్రజలు ఆదరించారు. 22010 ఓట్ల మెజార్టీతో విజయారెడ్డిపై దానం గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి.. చింతల రామచంద్రారెడ్డికి 38094 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఖైరతాబాద్..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. ధివంగత కాంగ్రెస్ నేత పీ జనార్ధన్ రెడ్డి (పీజేఆర్)కు ఖైరతాబాద్ నియోజవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు పీజేఆర్. పీజేఆర్ హఠాన్మరణంతో తర్వాత 2008లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్థన్ రెడ్డి(కాంగ్రెస్) ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి 20,846 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చింతల రామచంద్రా రెడ్డికి 53,102 ఓట్లు దక్కగా.. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు 32,256 ఓట్లు, వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డికి 23,845 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) తీర్థంపుచ్చుకున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 28,402 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్‌కు 63,068 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి 34,666 ఓట్లు లభించకా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దాసోజు శ్రావణ్ 33,549 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్




