Telangana Poltics – Kcr: తెలంగాణ లక్ష్మీనరసింహుడు సీఎం కేసీఆర్.. రాజకీయ వ్యూహంపై ప్రత్యేక కథనం..!

Telangana Poltics - Kcr: కేసీఆర్‌ రాజకీయ చతురుడు, వ్యూహకర్త, అపర ఆధునిక రాజకీయ చాణక్యుడు. సమకాలిన పరిస్థితులను, సంక్షోభాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో

Telangana Poltics - Kcr: తెలంగాణ లక్ష్మీనరసింహుడు సీఎం కేసీఆర్.. రాజకీయ వ్యూహంపై ప్రత్యేక కథనం..!
Kcr2

Telangana Poltics – Kcr: కేసీఆర్‌ రాజకీయ చతురుడు, వ్యూహకర్త, అపర ఆధునిక రాజకీయ చాణక్యుడు. సమకాలిన పరిస్థితులను, సంక్షోభాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో కేసీఆర్‌ను మించిన రాజకీయ దురందరుడు తెలుగు నేలపై మరొకరుండరు. అవసరమైనంత మేరకు స్నేహంగా మెలిగినా, అది శాశ్వతం కాదు. అలుసు అంతకంటే కాదు. పరిస్థితులు, పరిణామాలు ఎదురు తిరిగి అవి తన దగ్గరకు రాకముందే బుసకొట్టే నాగుపాము అవుతాడు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినట్లు అనిపిస్తే లక్ష్మీనరసింహ స్వామి అవతారమెత్తుతాడు. ఇప్పుడు కేసీఆర్‌ తెలంగాణ నేలపై ఆవిష్కరిస్తున్నది అదే. సాధారణ ఎన్నికలతో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరుగడం కేసీఆర్‌‌కు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అందుకే గతంలో ఒక ఏడాది ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని అనుకూల ఫలితాలు చవిచూశాడు.

కేసీఆర్‌ 2018లో వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లకపోతే ఫలితాలు మరోలా ఉంటాయనేది 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు స్పష్టం చేశాయి. నాలుగు లోక్‌సభ స్థానాలు బిజెపి దక్కించుకుంటే 3 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. ఇలాంటి ఫలితాలు వస్తాయనే లోక్‌సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలను జతకట్టకుండా విడిగా ఏడాది ముందే కేసీఆర్‌ మమ అనిపించాడు. అందుకే టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఇదే వ్యూహాన్ని అమలు పరుచడానికి కేసీఆర్‌ మళ్లీ సిద్ధం అయ్యాడు. ఏడాది ముందుగానే ఎన్నికలు వెళ్లాలనుకుంటున్న కేసీఆర్‌ అందుకు తగ్గుట్లుగా ఏడాది ముందుగానే ఎన్నికల ఏజెండాను రూపొందించాడు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్ కొనుగోలు చేయడం లేదనే అంశాన్ని తీసుకుని వార్‌ ప్రకటించాడు. భావోద్వేగాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలను ఒకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌.. 2014లో టీఆర్‌ఎస్‌‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అంతకంటే ఎక్కవ అభివృద్దిని సాధించారు. తెలంగాణ ప్రజలు కేవలం, అభివృద్ది, సంక్షేమంతో మాత్రమే సంతృప్తి చెందరని తెలిసిన కేసీఆర్‌కు 2018 అందివచ్చిన అంశం చంద్రబాబునాయుడు. కాంగ్రెస్‌తో జత కలిసి మహాకూటమిలో భాగస్వామిగా మారిన చంద్రబాబునాయుడు టార్గెట్‌గా కేసీఆర్‌ ఎన్నికల ఏజెండాను రూపొదించి విజయం సాధించాడు. మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఆంధ్రా పాలన వస్తుందని, చంద్రబాబు చేతుల్లోకి తెలంగాణ వెళుతుందనే ప్రచారంలో ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు తిరిగి టీఆర్ఎస్‌కు పట్టం కట్టారు.

ఇప్పుడు మళ్లీ ఒక అంశం కావాలి. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, రైతు బంధు లాంటి సాహసోపేతమైన పథకంతో సహా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజల్లో కనిపిస్తున్న అసంతృప్తి హుజురాబాద్‌ ఎన్నికల్లో ఆవిషృతమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తనదైన శైలిలో రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. వ్యూహాలకు పదును పెట్టాడు. తానే స్వయంగా రంగంలోకి దిగాడు. లక్షా 70వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తెలంగాణలో పండుతున్న నేపథ్యంలో బాయిల్డ్‌ రైస్ తీసుకోవడానికి కేంద్రం అంగీకరించలేదు. వానాకాలంలో బాయిల్డ్‌ రైస్ కొంతమేరకు తీసుకున్పటికీ, యాసంగిలో పండించే బాయిల్డ్‌ రైస్‌ ను తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక్కడే కేసీఆర్‌‌కు కేంద్రం ఎన్నికల ఆయుధాన్ని ఇచ్చింది. ఆ ఆయుధాన్ని కేంద్రంపై ఎక్కుపెట్టాడు. తన ప్రత్యర్థిని కేసీఆర్‌ ఎంచుకున్నాడు. అదే బీజేపీ.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పేరును ఏనాడు ప్రస్తావించడానికి ఇష్టపడని కేసీఆర్‌.. బండి సంజయ్‌ను వలలలోకి లాగాడు. తద్వారా కేంద్రాన్ని ఉచ్చులోకి లాగాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణలో ధాన్యం రాశులు పేరుకపోతున్నాయని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించిందంటూ రెండు మూడు రోజుల పాటు ప్రెస్‌ కాన్పరెన్స్‌లో దుమ్మెత్తిపోసిన కేసీఆర్‌.. ఏకంగా మహాధర్నాకు పిలుపునిచ్చి తానూ ధర్నాలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేంద్రానికి 48గంటల డెడ్‌లైన్‌ విధించాడు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా అంటూ కేసీఆర్‌ అల్టిమేటం ఇచ్చారు. కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ బాయిల్డ్‌ రైస్ కొనుగోలుపై స్పష్టత ఇవ్వలేకపోయింది.

లోక్‌సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఇష్టంలేని కేసీఆర్‌.. 2022 నవంబర్‌‌లో ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఏజెండా వరి. ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి కేంద్రం కారణమని, తాను కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నీరు, 24గంటల కరెంట్‌ ఇచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసినా కేంద్రం వైఖరితో రైతులు నష్టపోయారనే వ్యూహంతో కేసీఆర్‌ 2022 ఎన్నికలను పేస్‌ చేస్తారని విశ్లేషకుల భావన. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని కేసీఆర్‌ హైదరాబాద్‌‌లో మహాధర్నానే కాకుండా ఢిల్లీలో సైతం ధర్నా చేయాలని, దీక్ష చేయాలని సంకల్పిస్తున్నాడు. బెంగాల్‌‌ ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో మమతా బెనర్జీ బీజేపీని టార్గెట్‌ చేసి ఏ విధంగా రచ్చచేసిందో అదే రకంగా వరి అంశంతో బీజేపీని ఇరకాటంలో పెట్టి, బీజేపీపై ఫైట్‌ చేసి రాజకీయంగా పటిష్టమవ్వాలనేదే కేసీఆర్‌ వ్యూహాంగా కనిపిస్తోంది. ఒక టీఆర్‌ఎస్‌ నేత మాటల్లో చెప్పాలంటే బీజేపీ బెంగాల్‌లో మమత బెనర్జిని కాళికామాత రూపంలో చూస్తే తెలంగాణలో కేసీఆర్‌ను లక్ష్మీనర్సింహుడు రూపంలో గర్జిస్తాడని అంటున్నారు. కేసీఆర్‌ వ్యూహానికి కేంద్రం దగ్గర ప్రస్తుతానికైతే ఆయుధంలేదు. తెలంగాణలో వరి కొనుగోలు చేయకుంటే రైతుల వ్యతిరేకిగా మిగిలిపోతారు. అలా అని కొనుగోలుకు రెడీ అయితే అది కేసీఆర్‌ విజయమే అవుతుంది. ఏది జరిగినా కేసీఆర్‌కు లాభమే.

Also read:

Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!

Click on your DTH Provider to Add TV9 Telugu