అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై కన్నేసి..
Karimnagar Crime: కరీంనగర్‌లో కూలీ పని పేరుతో ఓ వృద్ధురాలిని నమ్మించి తీసుకెళ్లిన దుండగుడు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. దాదాపు 24 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడిన ఆమెను స్థానికులు రక్షించగా, రాపిడో బుకింగ్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 24 గంటల పాటు వ్యవసాయ బావిలోనే చిక్కుకుంది ఓ వృద్దురాలు. తన తల్లి కనిపించకుండా పోయిందని తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పని ఉందని చెప్పి తీసుకెళ్లి.. వృద్దురాలి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లి ఆమెను బావిలో తోసేయడం సంచలనంగా మారింది.
లేబర్ అడ్డాలో కూలీకి పిలిచి…
కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన లక్ష్మీ అనే వృద్దురాలు బుధవారం ఉదయం కూలి పని కోసమని టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్దకు చేరుకుంది. ఆమెను కొడుకు బైక్‌పై అక్కడ డ్రాప్ చేశాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటి తరువాత ఓ వ్యక్తి వచ్చి కూలి పని చేసేందుకు రావాలని అడగగా ఇందుకు ఆమె సమ్మతించింది. వెంటనే రాపిడో బైక్ బుక్ చేసిన సదరు వ్యక్తి తిమ్మాపూర్ స్టేజ్ వద్ద డ్రాప్ చేయాలని సూచించాడు. మరో వాహనంపై రాపిడో బైక్‌ను ఫాలో అయిన అగంతకుడు తిమ్మాపూర్ స్టేజ్ వద్దకు చేరుకున్న తరువాత ఆమెను తన బైక్‌పై డైరీ మీదుగా నుస్తులాపూర్ సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆమెను బెదిరించిన అగంతకుడు ఆమె ఒంటిపై ఉన్న అర తులం బంగారు ఆభరణాలను లాక్కుని వ్యవసాయ బావిలోకి తోసేశాడు.
లక్ష్మీకి ఈత రావడంతో ఆమె బావిలో ఈదుకుంటూ వేలాడుతున్న తాడును పట్టుకుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన అగంతకుడు ఆమె ఆసరగా చేసుకున్న తాడును కూడా కోసేసి పరార్ అయ్యాడని చెప్తోంది. బావిలో దొరికిన మరో ఆసరా ఆధారంగా గురువారం ఉదయం వరకూ అందులోనే ఉండిపోయింది. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుండి అరుపులు వినిపిస్తుండడంతో ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి బయటకు తీశారు. అయితే, పనికి వెళ్లే ముందు నుస్తులాపూర్‌లో కూలీ పనికి వెలుతున్నానని కొడుక్కి కాల్ చెప్పింది లక్ష్మీ.
మిస్సింగ్…
బుధవారం కూలీ పని కోసం టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద డ్రాప్ చేసిన తరువాత తన తల్లి కనిపించకుండా పోయిందని, కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఆమె తనయుడు కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం రాత్రి ఎఫ్ఐఆర్ జారీ చేసిన పోలీసులు ఆమె గురించి ఆరా తీయగా టవర్ లోకేషన్ నుస్తులాపూర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలుస్తోందని పోలీసులు వివరించారు. గురువారం ఉదయం వ్యవసాయ బావిలో లక్ష్మీ ఉందన్న సమాచారం అందుకున్న కొడుకుతో పాటు కుటుంబ సభ్యులంతా అక్కడకు చేరుకున్నారు.
రాపిడో బుక్ చేయడంతో…
కూలీ పని చేసేందుకు లక్ష్మీని తీసుకెళ్లేందుకు వచ్చిన అగంతకుడు రాపిడో యాప్ ద్వారా బైక్ బుక్ చేయడంతో పోలీసులు సాంకేతికతను అంది పుచ్చుకుని అగంతకుడిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కూడా అగంతకుడిని గుర్తించేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. టవర్ సర్కిల్ నుండి తిమ్మాపూర్ స్టేజ్ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించినట్టయితే అసలు విషయం వెలుగులోకి రానుంది. అయితే వృద్దురాలిని తీసుకెళ్లేందుకు రాపిడో యాప్ ద్వారా బైక్ బుక్ చేసిన అగంతకుడు ఆమెను తన వాహనంపై ఎందుకు తీసుకెళ్లలేదు..? తిమ్మాపూర్ స్టేజ్ వద్దకు చేరుకున్న తరువాత తన వాహనంపై తీసుకెళ్లి దోపిడీ చేసేందుకు ముందుగానే స్కెచ్ వేసుకుని ఉంటాడన్న అనుమానాం వ్యక్తం అవుతోంది.
వీడియో చూడండి..
