Telangana: ఇక దుమ్ముదుమారమే.. రేపో మాపో ఫైనల్ రిపోర్ట్.. ప్రజెంటేషన్‌కు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఎపిసోడ్ మొదలైంది. ప్రాజెక్టు లోపాలపై విచారణకోసం సీఎం రేవంత్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల క్రితం మొదలైన కాళేశ్వరం కమిషన్ 115 మందిని విచారించింది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఎపిసోడ్ మొదలైంది. ప్రాజెక్టు లోపాలపై విచారణకోసం సీఎం రేవంత్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల క్రితం మొదలైన కాళేశ్వరం కమిషన్ 115 మందిని విచారించింది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. ఇటీవల మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ వివిధ డాక్యుమెంట్లను జస్టిస్ పీసీ ఘోష్ కు అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైలును కూడా అందించినట్లు పేర్కొన్నాయి. కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది.
పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయం ఆగదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో రేవంత్ సర్కారు ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తంది. కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాళేశ్వరంగా మార్చి ప్రజా ధనం దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ప్రాంతానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం నిర్మాణ లోపాలపై NDSA ఇచ్చిన నివేదికపై ఎప్పటికప్పడు మాట్లాడుతూ కాళేశ్వరంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీల్డ్ ఎంక్వయిరీతో పాటు.. ప్రాజెక్ట్ ఇంజనీర్లు, అధికారులు, గత ప్రభుత్వ అధినేతలను ప్రశ్నించడం పూర్తవడంతో పీసీ ఘోష్ కమిషన్ రేపో మాపో ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేయనుంది. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. సీఎం మాట్లాడిన తర్వాత తాను కూడా మాట్లాడతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రాజెక్ట్ డిజైనింగ్, అనుమతులపై పీసీ ఘోష్ కమిషన్‌కు కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత రేవంత్ ప్రజెంటేషన్‌లో ఎలాంటి కొత్త విషయాలు బయటపెడతారనే ఉత్కంఠత ప్రజల్లో నెలకొంది.
మొత్తానికి పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయినా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏడాదిన్నర క్రితం మొదలైన రాజకీయ రచ్చ ఆగడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




