AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క.. ఎక్కడో కాదు తెలంగాణలోనే.. చూస్తే మైండ్ బ్లాంకే..

ఇదొక వింతైన మొక్క. ఈ మొక్క దగ్గరకు ఏదైనా పురుగు తన దగ్గరకు వస్తే చాలు లటుక్కున నోరేరి ఆరగించేస్తుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. కీటకాలనే బిర్యానీలా లాగించేసే ఒక అరుదైన మొక్క ఇప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమైంది. పాఠ్యపుస్తకాలకే పరిమితమైన ఆ వింత మొక్క విశేషాలు, అది ఎక్కడుంది? ఎలా కీటకాలను చంపుతుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

Video: వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క.. ఎక్కడో కాదు తెలంగాణలోనే.. చూస్తే మైండ్ బ్లాంకే..
Insect Eating Plant
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 22, 2026 | 8:12 PM

Share

సాధారణంగా కీటకాలు లేదా పురుగులు మొక్కల ఆకులపై దాడి చేసి వాటిని నాశనం చేయడం మనం చూస్తుంటాం. కానీ, దానికి పూర్తిగా విరుద్ధంగా.. ఏదైనా కీటకం తన దగ్గరకు వస్తే చాలు లటుక్కున నోరేరి ఆరగించేసే వింత మొక్క ఒకటి ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సందడి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇలాంటి అరుదైన కీటకాహార మొక్క ఇప్పుడు జడ్చర్ల లోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ‘తెలంగాణ బొటానికల్ గార్డెన్’లో కొలువుదీరింది.

కూజా ఆకారం.. కీటకాలే దీని ఆహారం..

వృక్షశాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన ఈ మొక్క పేరు నెపంథిస్ . ఈ మొక్కకు ఉండే ఆకులలోని నడిమి ఈనె ప్రత్యేకంగా రూపాంతరం చెంది ఒక కూజా ఆకారంలోకి మారుతుంది. దీనిపై ఒక చిన్న మూత కూడా ఉంటుంది. ఈ మూత రంగు, దాని నుండి వచ్చే ప్రత్యేక ఆకర్షణలు కీటకాలను అమితంగా ఆకర్షిస్తాయి. మూతపై వాలిన కీటకాలు.. అక్కడ ఉండే జిగురు ద్రవం వల్ల జారి నేరుగా కూజా లాంటి భాగంలోకి పడిపోతాయి. ఈ కూజా లోపల ప్రత్యేకమైన జీర్ణ ఎంజైములు ఉంటాయి. అందులో పడిన కీటకాలను ఈ ఎంజైములు పూర్తిగా కరిగించి జీర్ణం చేసేస్తాయి. ఆ కీటకాల నుండి మొక్క తనకు కావలసిన నత్రజని లాంటి ముఖ్యమైన పోషకాలను పొందుతుంది.

కాశీ హిల్స్ టు జడ్చర్ల..

సహజసిద్ధంగా ఈ నెపంథిస్ మొక్కలు మన దేశంలోని నాగాలాండ్, మేఘాలయలోని కాశీ హిల్స్ ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి అత్యంత సునిశితంగా ఉంటూ.. కేవలం చల్లని, తేమతో కూడిన ప్రదేశాలలో మాత్రమే బతుకుతాయి. ఇటీవల కాలంలో వీటిని హైబ్రిడ్లుగా మార్చి అనేక ప్రదేశాలలో పెంచుతున్నారు. స్కూల్, ఇంటర్మీడియట్ బయాలజీ పాఠ్యపుస్తకాలలో ఈ మొక్కల గురించి విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు జడ్చర్ల బొటానికల్ గార్డెన్‌లో దీనిని సంరక్షించడం వల్ల, విద్యార్థులు ఈ గార్డెన్‌ను సందర్శించినప్పుడు పుస్తకాల్లో చదివిన వింత మొక్కను ప్రత్యక్షంగా చూసి జ్ఞానాన్ని పొందే అద్భుత అవకాశం లభించింది.

కర్ణాటక నుండి వచ్చిన కానుక

వరంగల్‌కు చెందిన ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ ఈ అరుదైన మొక్కను కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో ఉన్న ఒక నర్సరీ నుండి సేకరించారు. దానిని ఆయన జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌కు బహుమతిగా ఇచ్చారని గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు. ఇలాంటి ఎన్నో అరుదైన, అంతరించిపోతున్న మొక్కలను తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా విద్యార్థులకు విషయపరిజ్ఞానం ప్రాక్టికల్‌గా అందుతుందని సదాశివయ్య వెల్లడించారు. ఈ అరుదైన మొక్కను బహుకరించిన ప్రకృతి ప్రేమికుడు నాగేశ్వర్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాగా పుస్తకాలకే పరిమితమైన కీటకాహార మొక్కలను నేరుగా చూసే భాగ్యం ఇప్పుడు పాలమూరు విద్యార్థులకు దక్కడం విశేషం. పర్యావరణ ప్రేమికులను, విద్యార్థులను ఈ ‘కూజా మొక్క’ విశేషంగా ఆకట్టుకుంటోంది.

వీడియో చూడండి..

Follow Us