Telangana: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు స్థానిక ప్రభుత్వాలకు సూచించింది IMD.

మిచౌంగ్ తుఫాను కారణంగా డిసెంబర్ 5న తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం రాష్ట్రంలో 204.4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయడంతో, ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం, మైచాంగ్ తుఫాను తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ప్రభావం చూపుతుంది.
🚨#Telangana is about to experience heavy to very heavy rainfall with extremely heavy falls (above 204.4 mm) on 5th December. Stay alert, stay safe! pic.twitter.com/tcsDZETaQy
— India Meteorological Department (@Indiametdept) December 4, 2023
చెన్నైలో వర్ష బీభత్సం
మిచౌంగ్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. తాంబ్రం ప్రాంతంలో 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
వానలు, వరదల కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి కూడా నీరు చేరింది. కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు. నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్లు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.
ఏపీ సర్కార్ అలెర్ట్….
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మిచౌంగ్ తుఫాను నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చన్న సమాచారంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారుల నియమించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
ఇటు తుపాను ప్రభావంతో అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో ఎగిసిపడుతున్న అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. మిచౌంగ్ తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపిస్తున్నారు. తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…