Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం ఘటనపై కొనసాగుతున్న విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు: డీహెచ్
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ ఇబ్రహీంపట్నం చేరుకొని విచారణ చేపట్టింది. క్యాంప్ జరిగిన రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులను ఎంక్వైరీ కమిటీ ప్రశ్నించింది.
Family planning operation Failed incident: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ ఇబ్రహీంపట్నం చేరుకొని విచారణ చేపట్టింది. క్యాంప్ జరిగిన రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులను ఎంక్వైరీ కమిటీ ప్రశ్నించింది. ఆపరేషన్ ఎవరు చేశారు..? ఆ తర్వాత మహిళల పరిస్థితిపై ఆరా తీశారు డీహెచ్ శ్రీనివాసరావు. స్టెఫలో కొకస్ బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిన మహిళలు మృతి చెందినట్లు సమాచారం. దీనిపై పలు విధాలుగా ప్రశ్నల వర్షం కురిపించారు ఎంక్వైరీ కమిటీ సభ్యులు. గత నెల 25వ తేదీన 34 మందికి డీపీఎల్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయగా, వారిలో నలుగురు చనిపోయారు. మిగతా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. చికిత్స పొందుతున్న 30 మంది మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డీహెచ్. శ్రీనివాసరావు. వారిలో మొత్తం 12 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇక ఆపరేషన్లు చేసిన వైద్యుడిని కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో విచారిస్తామన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇక్కడ చికిత్స చేసిన వైద్యులే సూర్యాపేట, చేవెళ్లలోనూ ఆపరేషన్ చేశారన్నారు. కానీ అక్కడ ఏ ఇబ్బంది రాలేదన్నారు. 34 మందిలో మొత్తం 25 మంది వరకూ ఇన్‌ఫెక్షన్ సోకిందన్నారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తానికి ఎంక్వైరీ కమిటీ ఇవాళ పూర్తిస్థాయిలో విచారించింది. ఫైనల్‌గా ఆపరేషన్ చేసిన వైద్యులను ప్రత్యేకంగా విచారించి.. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది ఎంక్వైరీ కమిటీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..