AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIMIM: తెలంగాణలో ‘గాలిపటం’ దారెటు..? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..

ఎంఐఎం.. హైదరాబాద్‌లో రివ్వున తిరిగే గాలిపటం.. అధికార పార్టీకి అండగా ఉంటూ పాత బస్తీలో రాజ్యమేలుతోంది. అయితే అధికార పార్టీ మారడంతో.. గాలిపటం.. ఎటు పయనిస్తుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తుందా లేక దూరంగా ఉంటుందా అనే విషయంలో ఆ పార్టీకే క్లారిటీ లేదు. కానీ బీజేపీ మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో కొన్నేళ్లుగా ఎంఐఎందే హవా.

AIMIM: తెలంగాణలో ‘గాలిపటం’ దారెటు..? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..
Asaduddin Owaisi - Akbaruddin Owaisi
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 09, 2023 | 8:18 AM

Share

ఎంఐఎం.. హైదరాబాద్‌లో రివ్వున తిరిగే గాలిపటం.. అధికార పార్టీకి అండగా ఉంటూ పాత బస్తీలో రాజ్యమేలుతోంది. అయితే అధికార పార్టీ మారడంతో.. గాలిపటం.. ఎటు పయనిస్తుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తుందా లేక దూరంగా ఉంటుందా అనే విషయంలో ఆ పార్టీకే క్లారిటీ లేదు. కానీ బీజేపీ మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో కొన్నేళ్లుగా ఎంఐఎందే హవా. 7 సీట్లు పక్కాగా ఖాతాలో వేసుకుని అసెంబ్లీలో తమ వాయిస్ వినిపిస్తుంది. ఇన్నాళ్లూ అధికార పార్టీతో దోస్తీ చేస్తూ తమకు కావాల్సిన పనులు సైలెంట్‌గా చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గులాబీ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది ఎంఐఎం. కేసీఆర్ సర్కార్‌కి బయటి నుంచి మద్దతు తెలుపుతూ.. స్నేహపూర్వకంగా గాలిపటం ఎగురుతోంది.

ఈసారి కూడా బీఆర్‌ఎస్సే గెలుస్తుందని ఎంఐఎం ధీమా వ్యక్తం చేసింది. కానీ అనూహ్యంగా బీఆర్‌ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. దీంతో ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మేం ఎప్పుడైనా ప్రభుత్వానికి సహకరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మా అవసరం పడదేమో అంటూ అసద్ కామెంట్ చేశారు.

ఇన్ని రోజులు బీఆర్‌ఎస్‌కి సపోర్ట్‌గా ఉన్న ఎంఐఎం.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలుస్తుందా లేకపోతే.. మిత్రధర్మం పాటిస్తూ అధికార కాంగ్రెస్‌కి దూరంగా ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. కానీ అధికార కాంగ్రెస్‌కి దూరంగా జరిగితే ఎంఐఎంకే నష్టమనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పాతబస్తీలో ఎంఐఎంకి పోటీగా ఎంబీటీ ఉంది. కాంగ్రెస్ గనుక ఎంబీటీని దగ్గరకు తీస్తే ఎంఐఎంపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

అయితే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటకాగడం ఎంఐఎంకి అలవాటే అని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు కాంగ్రెస్‌తోనూ అదే బంధాన్ని కొనసాగిస్తారని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికే దీనికి ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్.

మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంపీ సీటు గెలవడమే లక్ష్యంగా ఎంఐఎం పని చేస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితులో ఎంఐఎం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..