Vande Bharat: హైదరాబాద్ టూ బెంగళూరు ఇకపై ఏడున్నర గంటలే.. టికెట్ ఛార్జీల వివరాలివే.!
కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్ నడవనుంది. ఇప్పటికే ఈ రూట్‌లో వందేభారత్ ట్రయిల్ రన్ పూర్తి కాగా.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ఈ వందేభారత్ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచిన విషయం తెలిసిందే.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఇకపై హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. ఈ రూట్‌లో రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీన హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్ నడవనుంది. ఇప్పటికే ఈ రూట్‌లో వందేభారత్ ట్రయిల్ రన్ పూర్తి కాగా.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ఈ వందేభారత్ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచిన విషయం తెలిసిందే.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ఉన్న 609 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందేభారత్ రైలు సుమారు ఎనిమిదిన్నర గంటల్లో కవర్ చేస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రతీ రోజూ ఐదుకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా గమ్యస్థానాలు చేరుకోవడానికి సుమారు 12 గంటలు పడుతుంది. దీన్ని బట్టి చూస్తే.. వందేభారత్ రైలు పట్టాలెక్కితే.. దాదాపుగా 4 గంటల సమయం ఆదా అవుతుంది.
ప్రతీ రోజూ ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి.. కాచిగూడ రాత్రి 11.15 గంటలకు చేరుకుంటుంది ఈ వందేభారత్ రైలు. ప్రస్తుతానికి ఈ ట్రైన్‌లో ఎనిమిది బోగీలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. అందులో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు కాగా, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉంటుంది. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి బోగీల సంఖ్య పెంచే అవకాశం ఉంది రైల్వేశాఖ.
ఇక కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య పరుగులు పెట్టే ఈ వందేభారత్ రైలు ఛార్జీలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సుమారు రూ. 2,800.. అలాగే ఏసీ చైర్ కార్ రూ. 1500 వరకు ఉంటుంది ఇన్‌సైడ్ టాక్. ఈ రేట్లలో కేటరింగ్ ఛార్జీలు కూడా ఉండగా.. ప్రయాణీకులు తమకు కేటరింగ్ వద్దంటే.. వదులుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచనుంది రైల్వే శాఖ. కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో ఈ వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఈ రెండూ కూడా రద్దీ ఉండే రూట్లు కావడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల్లో వందేభారత్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..