Dakshin Healthcare Summit: దీర్ఘాయువు, ఆరోగ్యకర జీవితానికి సీక్రెట్స్ ఇవే.. వైద్య నిపుణుల వెల్లడి

TV9 Network's Dakshin Healthcare Summit: దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ వైద్య రంగ నిపుణులతో దక్షిణ్ హెల్త్ కేర్ సమ్మిట్ 2024లో ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడంలో అందుబాటులోకి వస్తున్న కొత్త వైద్య విధానాలు, దీర్ఘాయుష్షుకు దోహదపడే అంశాలు, యాంటి ఏజింగ్, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం తదితర అంశాలపై వైద్య రంగ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అనారోగ్యాలకు దూరంగా ఆనందకర జీవితానికి దోహదపడే అంశాల గురించి వారు కీలక సూచనలు చేశారు.

Dakshin Healthcare Summit: దీర్ఘాయువు, ఆరోగ్యకర జీవితానికి సీక్రెట్స్ ఇవే.. వైద్య నిపుణుల వెల్లడి
Dakshin Healthcare Summit 2024
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 03, 2024 | 4:17 PM

దేశ హెల్త్ కేర్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, రోబోటిక్స్ తదితర అధునాతన ఆవిష్కరణలు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మన ముందుంచుతున్నాయి. దేశ ఆరోగ్య సంరక్షణ రంగ సామర్థ్యాలు, అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు టీవీ9 నెట్‌వర్క్, సౌత్ ఫస్ట్ సంయుక్తంగా మొదటి ‘దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024’ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సదస్సులో అపోలో హాస్పటిల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. హెల్త్ కేర్ రంగంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో భారత్ పోటీపడుతోందని ఆమె చెప్పారు. వైద్య రంగంలోని కొన్ని అంశాల్లో సంపన్న దేశాలతో పోల్చితే భారత్ ఓ అడుగు ముందే ఉందన్నారు. వైద్య చికిత్సతో పాటు పరిశోధనల్లో యువకులు కూడా ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం కావడం విశేషమన్నారు. హెల్త్ కేర్ రంగంలో జరుగుతున్న పరిశోధనలకు భారీగా అందుబాటులో ఉన్న డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అల్గారిథమ్ తదితర అంశాలు దోహదపడుతున్నాయని విశ్లేషించారు. ప్రజా ఆరోగ్యంలో పరిశుభ్రమైన తాగినీరు, పౌష్టికాహారం, పారిశుధ్యం కూడా కీలక అంశాలుగా పేర్కొన్నారు.

ఆరోగ్యంపై ఎన్నో సందేహాలు, అపోహలు..

ఆరోగ్యం విషయంలో చాలా మందిలో అపోహలు, సందేహాలు ఉన్నాయని ఫోర్టిస్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్స్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ వ్రిత్తి లుంబా వివరించారు. గర్భాసయ క్యాన్సర్ వ్యాక్సిన్ మహిళలకు మాత్రమే అన్న అపోహ చాలా మందిలో ఉందని.. అయితే ఇది పురుషులు కూడా తీసుకోవాల్సిన వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు. అలాగే జెనిటిక్స్ కారణాలతోనే క్యాన్సర్ వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉందన్నారు. కేవలం 5 శాతం మాత్రమే జెనిటిక్స్ కారణాలతో క్యాన్సర్ వస్తుండగా.. మిగిలిన 95 శాతం ఇతరత్ర కారణాలతో వస్తోందని వివరించారు.

హార్ట్ అటాక్స్, కిడ్నీ వ్యాధులు, ఇతర వ్యాధులను చాలా వరకు నివారించేందుకు అవకాశముందని డాక్టర్ అర్విందర్ సింగ్ సొయిన్ పేర్కొన్నారు. దీర్ఘాయువు, యాంటీ ఏజింగ్ డ్రగ్స్ మార్కెట్ అమెరికాలో విపరీతంగా పెరిగిందన్నారు.

ఆరోగ్యంలో నిద్రది కీలక పాత్ర..

ఆరోగ్యకర జీవితానికి నిద్ర ఎంతో కీలకమని న్యూరాలజీ అండ్ స్లీప్ సెంటర్ డైరెక్టర్, ఫౌండర్ డాక్టర్ మన్వీర్ భాటియా అన్నారు. కోపం, భావోద్వేగం తదితరాలకు నిద్రలేమి దారితీస్తుందన్నారు. ప్రతి రోజూ ఏడు నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని సూచించారు. అధునాతన కాలంలో చాలా మందితో స్లీపింగ్ సైకిల్ పూర్తిగా మారిపోవడం మానసిక రుగ్మతలు, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఆరోగ్యవంతంగా.. సంతోషంగా ఉండాలంటే పౌష్టికాహారం, వ్యాయామం, నిద్రతో పాటు సోషల్ కనెక్షన్స్ కలిగి ఉండాలన్నారు. అలాగే నిత్యం కొత్త అంశాలను నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

హెల్త్ కేర్ రంగంలో సంస్కరణలు అవసరం..

ప్రజా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే హెల్త్ కేర్ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ వైద్యులు మంచివాళ్లు, ప్రైవేటు వైద్యులు మంచివాళ్లు కాదన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంటోందని.. ఇది సరికాదన్నారు. ప్రజారోగ్యం ఇప్పటికీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉందన్నారు.

వైద్య చికిత్సలో టెక్నాలజీ కంటే రోగులతో అప్యాయంగా టచ్ చేసి మాట్లాడటం చాలా ముఖ్యమని బెంగుళూరు రూరల్ ఎంపీ, పద్మశ్రీ డాక్టర్ సీఎన్ మంజునాథ్ అన్నారు. అపాయింట్‌మెంట్‌తో పాటు పరీక్షల రిజల్ట్స్ కూడా ఒకే రోజు అందించడం పట్ల ఎన్నారై రోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారని.. పలు సంపన్న దేశాల్లో ఇది సాధ్యంకాదన్నారు. జీతాల కంటే ఇన్సెన్టివ్స్, ప్రమోషన్స్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాయని అన్నారు.

మిత ఆహారం, ఎక్కువ సేపు ఫిజికల్‌ మొబిలిటీ ఆరోగ్య జీవితానికి దోహదపడుతుందని డాక్టర్ దీపక్ సైని పేర్కొన్నారు. డాక్టర్ ఉమర్ ఖాదీర్, డాక్టర్ ప్రశాంత్ ప్రకాష్ తదితరులు ఈ సదస్సులో పాల్గొని దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడే జీవనశైలి అంశాలపై మాట్లాడారు. ఈ సదస్సులో టీవీ9 సీఎఫ్‌వో శివానంద, సౌత్ ఫస్ట్ ఎడిటర్, ఫౌండర్ జీఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు.