AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

లగ్జరీ లైఫ్ కోసం ఓ యువకుడు… సొంత ఇంట్లోనే చోరీ జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ విచారణలో అతడి కథలో లూప్‌హోల్స్ బయటపడడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడినే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీటేల్స్ కథనం లోపల ...

Hyderabad: ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
Accused With Police
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 9:27 PM

Share

లగ్జరీ జీవితం కొనసాగించేందుకు ఓ యువకుడు సొంత ఇంట్లోనే చోరీ జరిగినట్టు నాటకం ఆడాడు. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో చివరికి అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలేక్య ఎస్టేట్‌లో ఉన్న పెంట్‌హౌస్‌లో ఫిబ్రవరి 9న గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని భాస్కర్ ప్రమోద్ ముల (32) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో భాస్కర్‌ చెప్పిన వివరాల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇంట్లో బలవంతంగా చొరబడిన ఆధారాలు లేకపోవడం, చెప్పిన కథనంలో పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారించారు.అప్పుడే.. ఈ చోరీ వెనుక అసలు కథ బయటపడింది. భాస్కర్ బీటెక్ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడని పోలీసులు తెలిపారు. అయితే చదువు మధ్యలోనే ఆపేసి భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉండి పర్సనల్ లోన్స్ తీసుకోవడం, అనేక క్రెడిట్ కార్డులు వాడడం ద్వారా ఖర్చులు పెంచుకున్నాడని విచారణలో తేలింది.

అప్పులు పెరిగిపోవడంతో 2024 నుంచి అతడు తన అమ్మమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యుల బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించడం ప్రారంభించాడు. దొంగిలించిన ఆభరణాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ముత్తూట్ ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టి సుమారు రూ.4.6 లక్షలు సమకూర్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అతడి అన్నయ్య పెళ్లి ఫిక్స్ అవ్వడంతో.. కుటుంబ సభ్యులు అమ్మమ్మ బంగారు ఆభరణాలు పెళ్లికి ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ సమయంలో తన దొంగతనాలు బయటపడతాయన్న భయంతో భాస్కర్ చోరీ నాటకం ఆడేందుకు ప్లాన్ వేశాడు. అతడు ఆభరణాల్లో కొన్నింటిని అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మరో బ్లాక్‌లో దాచాడు. అలాగే ఖాళీ బాక్సులు, తాళాన్ని మూసీ నదికి సమీపంలోని నాలాలో పడేసి.. ఇంట్లో దొంగతనం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి.. బంగారు గొలుసు, 6 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలు, వెండి పళ్లెం, 2 వెండి గిన్నెలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై BNSలోని సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us