నకల్ కొట్టి పాస్ అయ్యే విద్యార్థులు ఇన్విజిలెటర్‌కు దొరికినట్టుగానే నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లను అమ్మేవారు పోలీసులకు అడ్డంగా దొరికారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ, విక్రయ ముఠాను ఎల్‌బీ నగర్ జోన్‌లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు, ప్రింటర్లు, స్కానర్లు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ తన ఫ్లెక్స్ షాపులో నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తయారు చేసి వాటిని ప్రింట్ చేసేవాడు. ఈ రాకెట్ లో మరో నిందితుడు హేమంత్ కుమార్ కూడా గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మలక్ పేటలో రికో కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నాడు.
ఆనంద్ కుమార్ తో చేతులు కలపడంతో నకిలీ విద్యా సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఒక్కోక్కరి నుంచి వేల రూపాయలు తీసుకొని సర్టిఫికేట్లను ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా ఫెయిల్ అయిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించేవారు. నిందితులందరూ కలిసి వీసా అభ్యర్థులకు నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలను తయారు చేసి విక్రయించడంతోపాటు భారీ మొత్తంలో వసూలు చేయడం ప్రారంభించారు. వీసాల కోసం ప్రయత్నించే విద్యార్థులను టార్గెట్ చేసేవారని రాచకొండ పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఓ బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో చైతన్యపురిలోని ఓ కన్సల్టెన్సీలో సోదాలు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ విద్యా సర్టిఫికేట్లు, ఇతర నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..