Hyderabad: ముంపు ఇళ్ల ప్రజలు ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త
Hyderabad Floods: ప్రజలను ముందు సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. వారి ప్రాణాలు నిలపడం ఫస్ట్ టార్గెట్. అందుకే వరద తాకిడి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను ముందు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు అధికారులు. అయితే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. వారిని సేఫ్ ప్లేసులకు పంపిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాల్లో నిఘా పెద్దగా ఉంచడం లేదు. దీంతో దొంగల పని ఈజీ అయిపోయింది. ఈజీగా వచ్చి.. ఇబ్బంది లేకుండా అందినకాడికి దోచుకుని వెళ్తున్నారు. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు.
హైదరాబాద్, జులై 29: తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. దీంతో వాగులు, వరదలు పోటెత్తుతున్నాయి. పలుచోట్ల జలశయాలకు గండ్లు పడ్డాయి. కొన్ని ఊర్లను వరద చుట్టుముట్టింది. ఓవైపు జోరు వానలు తగ్గకపోవడం.. మరోవైపు వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి నీరు రావడంతో మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద బారిన పడతామని.. ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలను నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. ఇదే మంచు అదును అన్నట్లు రెచ్చిపోతున్నారు. వరద బాధితుల ఇళ్లే టార్గెట్‌గా పక్కా యాక్షన్ ప్లాన్‌తో దూసుకుపోతున్నారు దొంగలు. దీంతో వర్షంలో, వరదలో తడిసి ఇబ్బందులు పడినా బాగుండేదని భావిస్తున్నారు ముంపు ప్రాంత ప్రజలు. దీంతో అధికారులు, పోలీసులకు కొత్త తలనొప్పి వచ్చిపడింది.
వరద ప్రభావిత వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకొనట్టి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ముంపు ప్రాంతాల్లో జరిగిన దోపిడీలతో కూడా అప్రమత్తం కాలేకపోయారు పోలీసులు. ఫలితంగా గాజుల రామరం, నాగోల్‌లో వర్షాలతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిన వారిని టార్గెట్ చేశారు దోపిడీ దొంగలు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు నగదు దోచుకెళ్ళారు. ముంపు ప్రాంతాలను టార్గెట్ చేసిన దోపిడీ దొంగల ముఠా.. పక్కా ప్రణాళికతో ఖాళీ చేస్తున్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముందస్తుగా ఎంచుకున్న ప్రాంతల్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించి దోపిడీలకు పాల్పడుతున్నారు. వర్షాలతో ఇళ్ళు, అపార్ట్మెంట్ లకు తాళం వేసిన ఇళ్ల పై రెక్కీ నిర్వహించి అందిన కాడికి దోచుకు వెళ్తున్నారు.
గత ఏడాది ఎల్బీనగర్ తో పాటు కూకట్ పల్లిలో జరిగిన ముంపు ప్రాంతాల దోపిడీలతో అలెర్ట్ గా లేరనే విమర్శలు పోలీసులపై వ్యక్తం అవుతున్నాయి. పాత నేరస్థుల కదలికలు , ముంపు ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెడితే దోపిడీలు అరికట్టే అవకాశాలు ఉండేవి. కానీ పోలీసులు ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షితంగా బయటకు తరలించే పనిలో ఉండగా…దోపిడీ దొంగలు అదను చూసి చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలను కాపాడటంతో పాటు వారి ఇల్లు గుళ్ళు కాకుండా చూడాలని కోరుకుంటున్నారు నగర వాసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..