Musi River: మూసీలో ప్రవహించేది నీళ్లు కాదు..కాలకూట విషం.. శాస్త్రవేత్తల అధ్యయనంలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు
మూసీ కాలుష్యం కాల కూట విషంగా తయారైందా? మూసీ కాలుష్యం ముదిరిపోయి ఏకంగా ఫార్మాసూటికల్ కలుషితాలతో నిండిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అంటోంది ప్రపంచస్ధాయి అధ్యయనం. కాలుష్యంపై 104 దేశాల్లోని....
మూసీ కాలుష్యం కాల కూట విషంగా తయారైందా? మూసీ కాలుష్యం ముదిరిపోయి ఏకంగా ఫార్మాసూటికల్ కలుషితాలతో నిండిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అంటోంది ప్రపంచస్ధాయి అధ్యయనం. కాలుష్యంపై 104 దేశాల్లోని 258 నదులపై సైంటిస్టులు చేసిన పరిశోధనలో ప్రమాదకర నదుల్లో మూసీ 22వ స్ధానంలో నిలవడం ఆందోళనకరం. ప్రపంచంలోని 104 దేశాల్లోని 258 నదులపై సైంటిస్టుల అధ్యయనం ప్రమాదకర నదుల్లో 22వ స్థానంలో మూసీ కాలుష్యం కోరలు చాచుకుని నిలబడింది. మూసీ నీళ్లలో కెమికల్స్విపరీతంగా పెరిగిపోయాయని సైంటిస్టులు తేల్చారు. ఆ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషధ పదార్థాల(ఏపీఐ) ఆనవాళ్లను గుర్తించారు శాస్త్రవేత్తలు. యాంటీ బయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్లు కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయని వెల్లడించారు. ఈ నీటితో ఒక మందుల కంపెనీని నడిపించవచ్చని, నేరుగా మందులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పరిశోధన తేల్చి చెప్పింది. స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై స్టడీ చేసింది. ‘ది ప్రొసీడింగ్స్ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’(పీఎన్ఏఎస్) అనే జర్నల్ లో ‘ఫార్మాస్యూటికల్ పొల్యూషన్ ఇన్ ది వరల్డ్స్ రివర్స్’ పేరుతో ఈ స్టడీని చేసింది.
దేశవిదేశాల నిపుణులతో కూడిన ఈ బృందం 140 దేశాల్లోని 258 నదుల నుంచి శాంపిళ్లను సేకరించింది. మనదేశంలో ఢిల్లీలోని యమున, హైదరాబాద్‌లోని మూసీని ఎంపిక చేసుకున్నారు. ప్రపంచంలోని డేంజరస్నదుల్లో మూసీ 22వ స్థానంలో నిలిచింది. ఈ స్టడీ పోయినేడాది చివర్లో పూర్తయ్యింది. ‘ది ప్రొసీడింగ్స్ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’(పీఎన్ఏఎస్) అనే జర్నల్ లో ‘ఫార్మాస్యూటికల్ పొల్యూషన్ఇన్ది వరల్డ్స్రివర్స్’ పేరుతో ఆ వివరాలు ప్రచురితమయ్యాయి. మూసీ నీళ్లల్లో యాంటీ బయాటిక్స్ (బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వాడే మందులు), యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, నొప్పిని తగ్గించే, సర్దీ, అలర్జీని తగ్గించే, షుగర్‌ను తగ్గించే, ఒత్తిడి, నరాలకు సంబంధించిన మందులు, బ్రెయిన్ కి వాడే అనేక రకాల ఔషధాల ఆనవాళ్లు ఉన్నాయని స్టడీ తేల్చింది. జ్వరం కోసం వాడే పారాసిటమాల్ అవశేషాలూ ఉన్నట్లు తేలింది.
ఔషధాల సైంటిఫిక్ పేర్లు పరిశీలిస్తే మూసీలో సల్ఫామెతోక్జజోల్, మెట్రోనిడజోల్, మెట్ఫార్మిన్, సిట్రిజిన్, ఫెక్సోఫెనడైన్, ట్రిమెంతోప్రిమ్, ఎన్లాఫాక్సిన్, సిటాలోప్రామ్, గాబాపెంటిన్, వెల్నఫాక్సిన్, నాప్రాక్సిన్లు పెద్ద మొత్తంలో పేరుకుపోయినట్లు గుర్తించారు. ఆసియాలోని నదుల్లో 48 రకాల ఔషధ ఆనవాళ్లు ఉండగా ప్రపంచంలోని అన్ని నదుల్లో 14 రకాల పదార్థాలు కామన్‌గా ఉన్నట్లు తేలింది. లైఫ్స్టైల్కాంపౌండ్లుగా పిలిచే కెఫీన్, నికోటిన్లు భారీగానే ఉన్నట్లు గుర్తించారు. మూసీపై తాజా అధ్యయనం చూస్తే ఆ నీటితో మళ్లీ ట్యాబ్లెట్లు తయారు చేయవచ్చని అర్థమవుతోంది. ఆ స్థాయిలో మూసీలో ఔషధ ఆనవాళ్లు పేరుకుపోయాయి. ఫార్మా కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలను మూసీ లో డంప్ చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.
చాలా కాలంగా మూసీ పై అనేక పరిశోధనలు సాగాయి. చివరకు ఫార్మా వేస్ట్‌కు డంపింగ్ యార్డుగా మార్చారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 70 కిలోమీటర్ల దాకా నీరు కాలుష్యమైంది. ఫార్మా, ఇతర పరిశ్రమల వ్యర్థాలు పారేసేందుకు మూసీని డంపింగ్ యార్డుగా వాడుతున్నారు. దీనిపై మేం రెండేండ్ల కిందటే పరిశోధనలు చేశామంటున్నారు ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ ఫ్రొఫెసర్ రాందాస్. నల్గొండ జిల్లా వలిగొండ దాకా మూసీ పొల్యూట్ అయ్యింది. భూగర్భంలో 40 మీటర్ల లోతు వరకు కాలుష్యం చేరిపోయింది. ఈ నీళ్లతో అనేక రోగాలు వస్తున్నాయి. నీటిలో 0.3 మిల్లీ గ్రాముల వరకు ఉండాల్సిన బయో కెమికల్ ఆక్సిడెంట్లు 172 ఎంజీల నుంచి 185 ఎంజీల వరకు చేరాయంటున్నారు జియో ఫిజిక్స్ పరిశోధకుడు డాక్టర్ రాందాస్. ఇలాంటి పరిస్థితుల మధ్య మూసీ నీళ్లు చూసి ఆందోళన కాదు భయం ఏర్పడుతోంది. కాలకూట విషం ప్రవహిస్తోందా అన్నట్లుగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా నది జలం స్వరూపం కన్పించడం లేదు. చిక్కని రసాయనాల సమూహంగా కన్పిస్తోంది. ఇది కాలుష్యం కాదు.. మరేదో అన్నట్లు మూసీ మారిపోయింది.
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలు మెడిసిన్స్‌తో సమానమని చెబుతున్నారు. అంటే రోగం లేకపోయినా మందులు వేసుకుంటున్నట్లే అని, దీంతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు వాళ్లకు దానికి సంబంధించిన మందులు పని చేయవని చెబుతున్నారు. రోగం లేని వారికి కొత్త రోగాలు రావడం గ్యారెంటీ అంటున్నారు. మూసీ పరీవాహకంలో ఉండే జనం అక్కడి భూగర్భ జలాలను తాగితే నీటి ద్వారా, వ్యవసాయానికి వాడితే కూరగాయలు, ఆకుకూరల ద్వారా ఈ ఔషధ పదార్థాలు శరీరంలోకి చేరి ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. తాజా స్టడీ ప్రకారం పారాసిటమాల్ఆనవాళ్ల కారణంగా ఆ ప్రాంతవాసులు జ్వరం వచ్చినపుడు సాధారణ మందులు వాడితే త్వరగా తగ్గకపోవచ్చని నిపుణులు అంటున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకినపుడు యాంటీ బయాటిక్ అవశేషాల కారణంగా మందులు పని చేయవని, ఇతర రోగాలకు కూడా మందులు పనిచేయక రెసిస్టెన్స్ వస్తుందని చెబుతున్నారు.
ఇంత కాలుష్యాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు. ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. చివరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డూ ముఖం చాటేస్తోంది. ఎస్టీపీ ప్లాంట్ లు నామ్ కే వాస్తే లా మారిపోయాయి. అందుకే ప్రతి పరిశోధనలో మూసీ లో కాలుష్యం కొత్త విశేషాలను బయటకు వస్తున్నాయి. చివరికి ఆటం బాంబు కంటే డేంజర్ పరిస్థితులు మూసీ పరివాహకంలో ఉన్న ప్రజలను అక్కడ పంటలు వంటి వేస్తూ జీవనం సాగిస్తున్న వారిని వెంటాడుతున్నాయంటున్నారు పర్యావరణ పరిశోధకులు ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. పూర్తిగా ఫార్మా సుటికల్ అవశేషాలతో మూసీ నిండిపోయింది. కానీ ఇక్కడ అవసరాలకు ఈనీటినే ఉపయోగించుకోవాల్సిన దుస్థితి. ఈనీటితోనే ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నారు. పశువుల ఈ నీటినే తాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి.
ఉప్పల్ ప్రాంతం నుంచి మూసీ ముగిసే ప్రాంతం వరకూ అనేక చోట్ల మోటార్లు ద్వారా మూసీ నీటిని తోడి వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా నే ఒక ప్రమాదకరమైన నీటితో ఇక్కడ రైతులు పండిస్తున్నారు. కానీ గత్యంతరం లేదు. మరో మార్గం లేదు. అందుకే అనేక రకాల కాయగూరలు, ఆకుకూరలు పండిస్తున్నారు. మరోవైపు ఈ కాలుష్యం నీటితో పంటలు ఏపుగా పెరుగుతున్నాయనే నమ్మకంలో ఉన్నారు పర్వతపూర్, మూసీ పరివాహక గ్రామ రైతు అంజయ్య.
ఈ కాలుష్యం నీటితో స్థానికులను అనేక రోగాలు వెంటాడుతున్నాయి. మూసీలో లవణాలు పెరగడం వల్ల బ్లూబేబీస్ అనే వ్యాధులు వస్తున్నాయి. ఆ నీటిని తాగిన వారిలో నపుంసకత్వం వస్తుంది. ఆర్థరైటిస్, చర్మవ్యాధులు, కిడ్నీ జబ్బులు, రకరకాల కేన్సర్లు వస్తాయి. భార లవణాల మోతాదు పెరడం వల్ల 60 నుంచి 70 శాతం మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గొంతునొప్పి, కడుపునొప్పి సమస్యలు పెరుగుతున్నాయి.
మరి ఇంత డేంజర్ నీటితో స్థానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు అన్నీ కావు.. ఈ కాలుష్యం నీటివల్ల చాలా అనారోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అయితే.. ఈ నీటిలో ఒక్కడ పండిండే పంటలు డేంజర్ అని తెలుసు.. అందుకే వీటిని ఉపమోగించడంలేదుని తేల్చేస్తున్నారు మూసీ పరివాహక గ్రామం కాచవాని సింగారం రైతు శంకర్. మూసీకి వచ్చిన ఇంత పెద్ద విపత్తును ఏవిధంగా పరిష్కరించాలి అంటే.. అదంతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతిలో ఉందంటున్నారు పర్యావరణ వేత్తలు. ప్రభుత్వాలకు.. రాజకీయాలకు సంబంధం లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉన్నప్పుడే మూసీ నది ప్రక్షాళన జరుగుతుందంటున్నారు.
ఏదైనా.. అతి పెద్ద విపత్తు మూసీ నదిని చుట్టి ముట్టి ఉంది. దీనికి పరిష్కారం ఆలోచించకపోతే మూసీ పరివాహక ప్రాంతంలో అన్ని జీవరాశుల మనగడకే పెనుముప్పు సంభవించబోతోందనే ఆందోళన లు వ్యక్తమవుున్నాయి.
– వై.గణేశ్, టీవీ9 తెలుగు, హైదరాబాద్