Andhra Pradesh: “సీఎం జగన్ రాష్ట్రంలో లేరని ఇలా చేస్తారా”.. ప్రతిపక్షాలకు మంత్రి రోజా వార్నింగ్
కోనసీమ(Konaseema) అల్లర్ల ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే.రోజా(Minister RK.Roja) హెచ్చరించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదని...
కోనసీమ(Konaseema) అల్లర్ల ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే.రోజా(Minister RK.Roja) హెచ్చరించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేడ్కర్ పేరు పెట్టాలని నిరాహార దీక్షలు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టడం బాధాకరమన్నారు. దాడి చేసిన వారిలో 50 మందిని అరెస్టు చేశామన్న రోజా.. ఈ ఘటనలపై కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ(YCP) పాలనపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ వలనే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి మహావ్యక్తి పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని మంత్రి రోజా ప్రశ్నించారు. కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు లాగుతామని వార్నింగ్ ఇచ్చారు. కోనసీమ పేరు మార్చాలంటూ సూసైడ్ చేసుకుంటామంటూ టీవీల ముందుకు వచ్చిన వారు.. జనసేన పార్టీ నేత పవన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నారో తెలుస్తోందని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారన్న మంత్రి రోజా.. ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అప్పట్లో తుని ఘటనలో వైసీపీ వాళ్లు ఉంటే మీ పాలనలో ఎందుకు అరెస్టు చేయలేకపోయారని నిలదీశారు. కోనసీమలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. ధైర్యంగా ఉండాలని హితవు పలికారు. పోలీసులకు దెబ్బలు తగిలినా కష్టపడి పని చేశారని, ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. సీఎం జగన్ రాష్ట్రంలో లేరని ఇలాంటి కుట్రలు చేస్తే కుదరదని, ఆయన ఎక్కడ ఉన్నా ఆ చూపంతా ఏపీలోనే ఉంటుందని మంత్రి రోజా స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి