AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థాయ్‌లాండ్‌ టు హైదరాబాద్‌.. కోట్ల బిజినెస్‌కు అలాంటి వాళ్లే టార్గెట్.. 4 రోజుల్లోనే 10 మంది చిక్కారు..

థాయ్‌లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు హైడ్రోఫోనిక్‌ గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ముఠాను తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ ఛేదించింది. నెల రోజులపాటు గోప్యంగా నిఘా నిర్వహించిన అధికారులు కీలక సూత్రధారి సహా 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

థాయ్‌లాండ్‌ టు హైదరాబాద్‌.. కోట్ల బిజినెస్‌కు అలాంటి వాళ్లే టార్గెట్.. 4 రోజుల్లోనే 10 మంది చిక్కారు..
Ganja
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 5:22 PM

Share

తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగమైన ఈగల్‌ ఫోర్స్‌ అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌పై భారీ దెబ్బ కొట్టింది. సుమారు నెల రోజుల పాటు అత్యంత గోప్యంగా నిఘా నిర్వహించిన అధికారులు.. థాయ్‌లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు హైడ్రోఫోనిక్‌ గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో కీలక సూత్రధారి సహా మొత్తం 10 మంది డ్రగ్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ గంజాయితో పోలిస్తే హైడ్రోఫోనిక్‌ గంజాయి అత్యంత మత్తును కలిగించే డ్రగ్‌గా గుర్తింపు పొందింది. విదేశాల్లో ప్రత్యేక సాంకేతిక పద్ధతుల్లో సాగు చేసే ఈ గంజాయికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉండటంతో అక్రమ రవాణా ముఠాలు దీన్ని భారత్‌లోకి తరలిస్తున్నట్లు సమాచారం.. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా ప్రధానంగా థాయ్‌లాండ్‌ నుంచి గంజాయిని రహస్య మార్గాల ద్వారా హైదరాబాద్‌కు తీసుకొచ్చి, నగరంలోని హై-ప్రొఫైల్‌ కస్టమర్లు, పార్టీల నిర్వాహకులు, యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు బయటపడింది.

ముఠా కార్యకలాపాలపై అనుమానం వచ్చిన ఈగల్‌ అధికారులు నెల రోజుల పాటు వారి కదలికలు, ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థపై నిశితంగా నిఘా ఉంచి ఆధారాలు సేకరించారు. అనంతరం పక్కా సమాచారంతో సమన్వయ దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉండే అవకాశం ఉందని, డ్రగ్స్‌ సరఫరా గొలుసులో ఉన్న ఇతర వ్యక్తులను కూడా గుర్తించే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి.

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ఎవరెవరికి చేరాయి, ఈ నెట్‌వర్క్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలు ఏమిటన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ భారీ పట్టివేతతో తెలంగాణలో అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరిన్ని ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us