Fish Prasadam: వాహనదారులకు అలర్ట్..! శనివారం ఆర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లో చేప ప్రసాద పంపిణీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వేలాది ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో..
నాంపల్లి: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లో చేప ప్రసాద పంపిణీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వేలాది ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీనెలకొంది. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రద్దీని బట్టి, ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేతలు చేపడుతామని అధికారులు చెప్పారు. శనివారం (జూన్ 10) అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. కాగా ఈ ఏడాది చేప ప్రసాదం పుచ్చుకోవడానికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వివరాలివే..
- ఎమ్‌జే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి జీపీవో అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
- ఎమ్జే బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అలస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ తదితర ప్రాంతాలకు మళ్లిస్తారు.
- పీసీఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.
- నాంపల్లి వైపు నుంచి కార్లలో వచ్చే వారు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్‌లో పార్కు చేయాలి. అనంతరం అజంతా గేట్ 2 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి వెళ్లాలి.
- వీఐపీ కారు పాస్ ఉన్న వారు ఎంజే మార్కెట్ నుంచి గాంధీ భవన్ వరకు వచ్చి ఎడమ వైపు తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్-1, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకొని గేట్-1, సీడబ్ల్యూసీ గేట్ ద్వారా లోపలికి వెళ్లాలి. చేప ప్రసాదం అనంతరం వీఐపీ వాహనాలు వీఐపీ గేట్, సీడబ్ల్యూసీ గేట్ నుంచి అదాబ్ హోటల్ నుంచి నాంపల్లి మీదుగా బయటకు వెళ్లాలి.
- ఎమ్‌జే మార్కెట్ నుంచి బస్సులు/వ్యాన్‌లలో వచ్చే వారు గాంధీ భవన్ బస్టాప్‌లో దిగాలి. నాంపల్లి నుండి వచ్చే బస్సులు/వ్యాన్లు గృహ కల్ప బస్ స్టాప్ వద్ద దిగి, చేప ప్రసాదం కోసం అజంతా గేట్/గేట్ నెం.2 ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు కాలినడకన వెళ్లాలి.
- ఎమ్‌జే మార్కెట్ నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు వాహనాలను భీమ్‌రావ్ బడా పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేయాలి. నాంపల్లి నుంచి ద్విచక్ర వాహనదారులు వాహనాలను ప్రధాన రహదారికి ఎడమ వైపున పార్క్ చేయాలి (గృహ కల్పకు బీజేపీ కార్యాలయానికి మధ్య ద్విచక్ర వాహనాలకు పార్క్ చేయాలి).
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.