హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనపై సీఎం రేవంత్ స్పందించారు. నోటిఫికేషన్ వచ్చాక నిబంధనలు మార్చడం సరికాదన్నారు. కొందరు కావాలనే అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు కేసులు పెట్టవద్దని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. పరీక్ష వాయిదా పడితే విద్యార్థులకే నష్టం అన్నారు. నోటిఫికేషన్ వచ్చాక నిబంధనలు మార్చడం సరికాదన్నారు. నోటిఫికేషన్ సమయంలోనే జీవో 29 తెచ్చామని, కొందరు కావాలనే అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘గ్రూప్ 1 అభ్యర్థులు విపక్షాల ట్రాప్‌లో పడొద్దని’ సీఎం రేవంత్ సూచించారు. డీఎస్సీ ముందు కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని, అభ్యర్థులపై కేసులు పెడితే వారి కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని పోలీసులకు సూచించారు. గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయొద్దని అన్నారు.
కాగా మరో రెండు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 అభ్యర్ధులు వాయిదా వేయాలంటూ ఆందోళన చెపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. ఇదే అదనుగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కూడా ర్యాలీలో చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బండి సంజయ్, శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లతోపాటు పలువురు గ్రూప్ 1 అభ్యర్ధులను కూడా అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. అనంతరం పోలీసులు అభ్యర్ధులందరినీ చెదరగొట్టారు. తాజాగా ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. కొందరు రాజకీయ లబ్ధికోసం అమాయకులైన నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.