Hyderabad: రెండేళ్లుగా వేధించిన అధిక రక్తపోటుకు చెక్.. గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
Rare Surgery Successfully: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, ఆమెకు "ఫియోక్రోమోసైటోమా" (Pheochromocytoma) అనే అత్యంత..

Rare Surgery Successfully: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, రెండేళ్లుగా తీవ్రమైన అధిక రక్తపోటుతో బాధపడుతున్న 27 ఏళ్ల యువతికి కొత్త జీవితం అందించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన లావణ్య గత రెండేళ్లుగా నియంత్రణలోకి రాని అధిక రక్తపోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రోజూ మూడు రకాల రక్తపోటు మందులు వాడుతున్నప్పటికీ ఆమె బీపీ స్థాయిలు తగ్గకపోవడంతో పాటు తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, ఆమెకు “ఫియోక్రోమోసైటోమా” (Pheochromocytoma) అనే అత్యంత అరుదైన అడ్రినల్ గ్రంథి కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథుల్లో ఏర్పడుతుంది. వైద్యుల వివరాల ప్రకారం, ఈ కణితి కారణంగా అడ్రినలిన్ సహా ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. దీంతో రక్తపోటు ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది లక్షల మందిలో కేవలం ఇద్దరి నుంచి ఎనిమిది మందికి మాత్రమే ఈ వ్యాధి కనిపిస్తుందని వైద్యులు తెలిపారు.
ఈ కణితిని తొలగించే శస్త్రచికిత్స కూడా అత్యంత ప్రమాదకరమైనదే. ఆపరేషన్ సమయంలో రోగి రక్తపోటు 300/180 కంటే ఎక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. మరోవైపు కణితిని తొలగించిన వెంటనే రక్తపోటు ఒక్కసారిగా పడిపోవచ్చు. అందుకే ప్రతి క్షణం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం అవుతుంది.
శస్త్రచికిత్సకు ముందు లావణ్యకు కొన్ని రోజుల పాటు ఆల్ఫా-బ్లాకర్లు, బీటా-బ్లాకర్ల మందులు ఇచ్చి రక్తపోటును నియంత్రణలోకి తీసుకొచ్చారు. బుధవారం యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రవిచందర్ నేతృత్వంలో నాలుగు గంటల పాటు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ వైద్య బృందంలో ఎండోక్రినాలజీ, రేడియాలజీ, అనస్థీషియా విభాగాలకు చెందిన డాక్టర్ విజయ్ శేఖర్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ శ్రీహరి తదితర నిపుణులు పాల్గొన్నారు. వైద్యులు కణితిని విజయవంతంగా తొలగించగా, ప్రస్తుతం లావణ్య రక్తపోటు పూర్తిగా నిలకడగా ఉందని తెలిపారు. ఆమె ఆరోగ్యంగా కోలుకుంటూ ఉండగా, ఇకపై సాధారణ జీవితం గడపగలదని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రైవేటులో రూ.5 లక్షల ఖర్చు.. గాంధీలో ఉచితం
ఈ తరహా అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే గాంధీ ఆస్పత్రిలో ఈ చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి వైద్య బృందాన్ని అభినందిస్తూ, వివిధ విభాగాల సమన్వయంతో గాంధీ ఆస్పత్రి ఇలాంటి క్లిష్ట కేసులను కూడా విజయవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
