Hyderabad: దేవుడిలా వచ్చిన పోలీసులు.. చావుబతుకుల్లో ఉన్న చిన్నారికి ఊపిరి పోసిన ఖాకీలు..
ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడో ఉండడు.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడే మనుషుల రూపంలోనే ఉంటాడని హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించారు. అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ఏడాది చిన్నారికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ బృందం దేవుడిలా వచ్చి ప్రాణాలు పోసింది.

శాంతిభద్రతలను కాపాడటమే కాదు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలను రక్షించడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ బృందం సమయస్ఫూర్తితో వ్యవహరించి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక ఏడాది చిన్నారికి సకాలంలో సీపీఆర్ అందించి ప్రాణాలు కాపాడారు. నగరంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భావోద్వేగాన్ని, పోలీసులపై ప్రశంసల జల్లును కురిపిస్తోంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న టోలిచౌకికి చెందిన ఒక వ్యక్తి, వీకెండ్ సెలవుల కోసం తన కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో శంషాబాద్–ఆరాంఘర్ మార్గంలోని శాతంరాయి సమీపానికి రాగానే.. కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పూలకుండీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఏడాది చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఊపిరి ఆడక ఆ పసికందు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో ఏం చేయాలో పాలుపోక ఆ కుటుంబం రోడ్డుపై అల్లాడిపోయింది.
దేవుడిలా వచ్చిన డీసీపీ శ్రీనివాస్ బృందం
సరిగ్గా అదే సమయంలో సిటీ నైట్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తూ శంషాబాద్ వైపు నుంచి నగరానికి వస్తున్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. రోడ్డుపై ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి పరుగులు తీశారు. కారులో ఊపిరి ఆడక విలవిలలాడుతున్న చిన్నారి పరిస్థితిని డీసీపీ బృందం వెంటనే అంచనా వేసింది. ఆసుపత్రికి తరలించే వరకు ఆగితే చిన్నారి ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన పోలీసులు.. ఆలస్యం చేయకుండా చిన్నారిని చేతుల్లోకి తీసుకుని అత్యంత సమయస్ఫూర్తితో సీపీఆర్అందించారు. పోలీసుల నిరంతర ప్రయత్నంతో కొద్దిసేపటికే ఆ చిన్నారి మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించి, ఏడవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఆసుపత్రికి తరలింపు.. సురక్షితంగా చిన్నారి..
శ్వాస ఆడాక వెంటనే పోలీసులు ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఆ చిన్నారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో ఉందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం అందింది. అర్ధరాత్రి వేళ డీసీపీ శ్రీనివాస్ బృందం చూపిన అప్రమత్తత, వేగవంతమైన స్పందన వల్లే తమ బిడ్డ ప్రాణాలు దక్కాయని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆపదలో ఉండే ప్రజల ప్రాణాలు రక్షించడంలో పోలీసులు ఎంతటి సేవాభావంతో, మానవత్వంతో పని చేస్తారో ఈ ఘటన మరోసారి నిరూపించింది’’ అంటూ స్థానికులు, నెటిజన్లు డీసీపీ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
