Bullet Train: హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ రైలు.. కేవలం మూడున్నర గంటల్లోనే..!
Bullet Train: భాగ్యనగరానికి మరో మరో మణిహారం అందబోతోంది. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి శరవేగంగా..
Bullet Train: భాగ్యనగరానికి మరో మరో మణిహారం అందబోతోంది. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి శరవేగంగా రాకపోకలు సాగించే సమయం త్వరలో రానుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ప్రతిపాదించింది. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ వెల్లడించారు. అదే నెల 18న టెండర్లు కూడా పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్న గంటల్లో చేరుకునే వెలుసుబాటు వస్తుంది. దీంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లినా 14 గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తారు.
వికారాబాద్ మీదుగా..
ఇక ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్‌ను లింక్ చేస్తూ నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబై-పుణె-జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తాజాగా ముంబై-పుణె-గుల్బర్గా-తాండూరు-వికారాబాద్ మీదుగా హైదరాబాద్‌కు అలైన్‌మెంట్ మార్చనుండటంతో 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది.
త్వరలో 40 గ్రామాల్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్:
ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ ఆధ్వర్యంలో బుల్లెట్ రైల్వే లైన్ సర్వే పనులు చేపట్టారు. వికారాబాద్ జిల్లాపరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు. జిల్లా పరిధిలోని తాండూరు, పెద్దేముల్, ధరూర్, వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేపట్టనున్నారు.
ప్రాజెక్టు కోసం కొత్త ట్రాక్..
ముంబైలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి సరైన స్థలం లేనందున నవీముంబైలో నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడి విమానాశ్రయ స్థలంలో భూగర్భంలో రైల్వే టెర్మినల్ నిర్మించాలని ఆలోచిస్తున్నామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ అధికారులు పేర్కొన్నారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనేదానిపై ఓ క్లారిటీ రానుంది. ప్రాజెక్టు కోసం కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్ బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 8 బుల్లెట్ రైలు కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో నాలుగింటికి ముంబైతో లింకు ఉంది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌ను 2028లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హైస్పీడ్ కారిడార్ వేగం గంటకు గరిష్ఠంగా 350 కి.మీ
కాగా, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు లైన్ ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేపట్టడానికి అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కొనసాగుతోంది. గూగుల్ మ్యాపింగ్ చివరి దశకు చేరింది. గూగుల్ మ్యాపింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్‌ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుతం హైస్పీడ్ కారిడార్ వేగం గంటకు గరిష్ఠంగా 350 కిలోమీటర్లుగా నిర్ధారించారు.