Secunderabad: ఎన్ని బాధలొచ్చాయి తల్లీ.. ఇద్దరు పిల్లలతో కలిసి…
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో జీవైరెడ్డి బస్తీలో విషాదం జరిగింది. 8 అంతస్తుల భవవనం నుంచి కిందపడిన సౌందర్యా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు . ఆత్మహత్యా? మరేదైనా కోణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు సాగుతోంది.

సౌందర్య-గణేష్‌లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కట్నకానులు లాంఛనాలతో పెళ్లి ఘనంగా చేశారు సౌందర్య తల్లిదండ్రులు. గణేష్‌ది ఉప్పల్. మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవాళ్లు. వాళ్లిద్దరు వాళ్లకు ఇద్దరు పిల్లలు. నిత్య, నిదర్శన్ ఇద్దరూ కవలలు. అంతా బాగుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆలుమగల మధ్యల గొడవలు..ఆ క్రమంలో సౌందర్య పుట్టింటికి చేరడం..ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయాయి. భర్త గణేష్ వేధింపుల వల్లే సౌందర్య ఆత్మహత్య నిర్ణయం తీసుకుందా? సౌందర్య ఇద్దరు చిన్నారుల అర్ధాంతర మరణం ప్రతీఒక్కర్నీ కదిలించింది. అయ్యో పాపం అంటూ స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక కన్నవాళ్ల ఆవేదన అంతా ఇంతా కాదు..
ముమ్మాటికీ భర్త అతని కుటుంబసభ్యుల వేధింపులే సౌందర్యను ఇద్దరు చిన్నారులను బలితీసుకున్నాయని ఆరోపించారు స్థానికులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్‌పేటలో సౌందర్య కుటుంబసభ్యులను పరామర్శించారు. చాలా బాధకరమైన ఘటన అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. సౌందర్య మరణానికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.
సౌందర్య, ఇద్దరు చిన్నారుల అర్ధాంతర మరణం అందర్నీ కలిచివేసింది. భర్త, అత్తింటి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందా? లేక మరేదైనా కారణం వుందా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.




