Hyderabad: ప్రాణనష్టం జరగకూడదు.. సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యలు చేపట్టాలి.. మంత్రి కేటీఆర్ ఆదేశం
హైదరాబాద్ (Hyderabad) మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మూసీ నదికి వరద పోటెత్తుతోంది. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR).. సంబంధిత అధికారులకు పలు సూచనలు....
హైదరాబాద్ (Hyderabad) మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మూసీ నదికి వరద పోటెత్తుతోంది. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR).. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రగతిభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితి గురించి సమాచారం తెలుసుకున్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టి, ముందస్తు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాల (Rains) వల్ల ఓల్డ్ బిల్డింగ్స్ కూలే అవకాశం ఉన్నందున ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాలన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వివరించారు. స్థానికంగా ఉన్న వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూశాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు పరిసర మున్సిపాలిటీల్లోని అధికారులు, జలమండలి కలిసి వరద నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఉపయోగించుకోవాలి. పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలి. చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించి నిల్వ సామర్థ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలి. వర్షాలు తగ్గాక అత్యవసరమైన రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలి.
– కేటీఆర్, తెలంగాణ మంత్రి
కాగా.. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ వరద ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై వంతెనపై రాకపోకలను నిలిపివేసారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. జంట జలాశయాలకు వరద భారీగా వస్తోంది. హుస్సేన్ సాగర్‌కూ భారీగా వరద వస్తోంది. రానున్న రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హుస్సేన్ సాగర్ దిగువన, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని వారిని అప్రమత్తం చేశారు.