Telangana: లైసెన్స్‌లు లేని ఆసుపత్రులపై కొరడా.. వైద్య శాఖ దాడులతో యజమానుల గుండెల్లో గుబులు
నిబంధనలను తుంగలో తొక్కి, ఎడాపెడా ప్రైవేటు ఆసుపత్రులు పెట్టేసి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటించకుండా, ఎంచక్కా డబ్బులు దోచేద్దామనుకుంటే ఇక చెల్లదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. అందులో..
నిబంధనలను తుంగలో తొక్కి, ఎడాపెడా ప్రైవేటు ఆసుపత్రులు పెట్టేసి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటించకుండా, ఎంచక్కా డబ్బులు దోచేద్దామనుకుంటే ఇక చెల్లదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్‌లు లేని ఆసుపత్రులపై కొరడా ఝుళిపించింది. అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లపై వైద్య ఆరోగ్య శాఖ దాడులతో వణుకు పుట్టిస్తోంది. అర్హత లేకుండా అక్రమంగా నిర్వహిస్తోన్న ప్రైవేటు ఆసుత్రులపై నాలుగు రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ దాడులు అక్రమాసుపత్రుల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో ముమ్మర తనిఖీలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 81 ఆసుపత్రులను సీజ్ చేసింది. మరో 64 ఆసుపత్రులకు ఫైన్‌లు వేసింది. కాగా.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,569 ఆసుపత్రులను వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 416 హాస్పిటల్స్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై మరో రెండు వారాల్లో స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అల్లోపతి పరిధిలోకి రాని ఆస్పత్రులు, తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. అయితే కొందరు జిల్లా DMHO కార్యాలయ సిబ్బంది, కొందరు అధికారులు డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టామన్నారు. పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. లైసెన్స్ జారీ చేసేందుకు ఎవరైనా డబ్బులు డిమాండ్ తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆర్ ఎంపీలు, పీఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. అర్హత లేకుండా శస్త్ర చికిత్సలు, అబార్షన్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎంబీబీఎస్ బోర్డ్ పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోన్న వారిని సహించేది లేదని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం