Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రిస్క్‌లో డిస్క్.. నగరవాసులను వెంటాడుతున్న నడ్డి సమస్య.. కారణాలు ఏంటంటే..?

మెట్రోపాలిటన్ సిటీల్లో ప్రయాణీకుల డిస్క్‌లు రిస్క్‌లో పడుతున్నాయి. ఎస్‌...ఆర్ధోకేసుల్లో అత్యధికశాతం డిస్క్ డ్యామేజ్ కేసులే కావడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకీ మన నడ్డి ఎందుకు విరుగుతోంది. రికార్డు స్ధాయిలో డిస్క్ డేమేజ్ కేసులు నమోదు కావడానికి అసలు కారణాలేంటి?

Hyderabad: రిస్క్‌లో డిస్క్.. నగరవాసులను వెంటాడుతున్న నడ్డి సమస్య.. కారణాలు ఏంటంటే..?
Back Pain
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 19, 2023 | 4:41 PM

ఇప్పుడు ప్రధానంగా నగర వాసులను డిస్క్‌ సమస్య హడలెత్తిస్తోంది. ఎవరిని కదిలించినా డిస్క్‌ రిస్క్‌ సమస్య పీడిస్తోన్న విషయం స్పష్టమౌతోంది. ఉపాధికోసమో….చదువుల కోసమో పట్టణాలకు పరుగులు పెడుతోన్న జనాన్ని రకరకాల అనారోగ్య సమస్యలు హడలెత్తిస్తున్నాయి.  అర్బనైజేషన్‌ తో హైదరాబాద్…నగరం కిటకిటలాడుతోంది. విద్యా. వైద్యం, ఉద్యోగ అవకాశాలు.. ఇలా ఇక్కడికి తెలుగు రాష్ట్రాలే కాదు… ఇతర రాష్ట్రాలు నుంచి కూడా జనం తరలివస్తున్నారు. పెరిగిన జనాభాకనుగుణంగా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. బండ్ల మీదే గంటల తరబడి ప్రయాణాలు.. ఇసుకేస్తే రాలని ట్రాఫిక్ సమస్య. గతుకుల రోడ్లు…అడుగడుక్కీ బ్రేకులు …డిస్క్‌ సమస్యకి ఇంతకన్నా వేరేకారణమక్కర్లేదు. ఇవే ఇప్పుడు జనం నడ్డి విరుస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా డిస్క్ సమస్యలు నమోదవుతున్నాయి.

హైదరాబాద్‌ లో సగటు వాహనదారుల డిస్క్ లు రిస్క్ లో పడుతున్నాయి. ఇదే విషయాన్ని ఆర్ధోపెడిక్ అసోసియేషన్‌, ఆర్థో, స్పైన్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నగరాల్లో వాహనదారులు డిస్క్ లు ఎంత రిస్క్ లో ఉన్నాయో హైదరాబాద్‌లో ఒక్కసారి ప్రయణం చేస్తే ఎవరికైనా అనుభవంలోకి వస్తుంది. డిస్క్‌ సమస్యకు నగరాల్లో నరకప్రాయంగా మారిన ప్రయాణాలు ఒక ప్రధాన కారణం అయితే. అత్యధిక గంటలు కదలకుండా కూర్చుని పనిచేయడం కూడా తీవ్రమైన నడుంనొప్పికీ, డిస్క్‌ సమస్యకూ దారితీస్తోంది.

మన నగరంలో ట్రాఫిక్ గురించి చెప్పేది ఏముంది. గతుకుల ప్రయాణం తప్పనిసరి. వాహనాలు వెళుతోంది రోడ్లపైనా లేక…జలాశయాలమీదా అన్న అనుమానం రాకమానదు. టూవీలర్లు, ఆటోలే కాదు… కారుల్లో ప్రయాణం కూడా నరకాన్ని తలపిస్తుంది. రోజులో అరగంట ప్రయాణం చేస్తే చాలు.. ఒళ్లు హూనం కావడం ఖాయం. కాదు…కాదు…నడుము విరిగటం ఖాయం. ఒకవైపు విపరీతమైన రద్దీ.. నిముషాల్లో వెళ్లాల్సింది గంటలు సమయం పడుతుంది. మరోవైపు డేంజర్ బెల్స్‌ మోగిస్తోన్న ట్రావెలింగ్ ఇష్యూస్‌. నిజంగా భయం వెస్తోందంటున్నారు బాధితులు. ఒళ్లు హూనం కావడమే కాదు.. నడుములు విరుగుతున్నాయి. అయినా పట్టించుకునేవారు ఎవరు? అంటూ పెదవి విరుస్తున్నారు మరికొందరు వాహనదారులు.

ఇలాంటి ప్రయాణాల్లో కళ్లముందే అనేక ప్రమాదాలు. ఈ గతుకుల రోడ్లలో జారి పడుతున్నవారు… చావుతప్పి కాళ్లు చేతులు విరుగుతున్నవారు ఆసుపత్రుల్లో క్యూకడుతున్నారు… ఇలాంటివి నిత్యకృత్యంగా మారాయంటున్నారు పబ్లిక్.  ఈ మధ్యకాలంలో డిస్క్ సమస్యలు పెరుగుతున్నాయి. గంటల తరబడి జర్నీలు, గతుకుల మయమైన రహదారుల్లో ప్రయాణాలు ప్రధాన కారణమంటున్నారు వైద్యులు. మరి దీని పరిష్కారం ఏంటి? రిస్క్ లో ఉన్న డిస్క్ లకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటే.. మనకు ఇది వేయి కాదు లక్షల డాలర్ల ప్రశ్న.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.