Hyderabad: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘కోకాపేట’ భూములు.. ఎందుకింత డిమాండ్ పలుకుతోందంటే.?

కార్పొరేట్‌ దిగ్గజ కంపెనీల చూపంతా హైదరాబాద్‌ వైపే ఉంది. దీంతో కొత్త ఆఫీసులకు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది! మంచి వసతులు, సెక్యూరిటీకి ఫిదా అయి దేశ, విదేశాల నుంచి కంపెనీలు, స్టార్టప్‌‌లు భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో భారీ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌లలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టింది. 9.5 ఎకరాల్లో అమెజాన్ ఆఫీస్‌ ఇక్కడే ఉంది. ఇది అమెరికా తర్వాత అతిపెద్ద ఆఫీస్‌. ఇక 54 ఎకరాల్లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసింది.

Hyderabad: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 'కోకాపేట' భూములు.. ఎందుకింత డిమాండ్ పలుకుతోందంటే.?
Kokapet Land Auction
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 04, 2023 | 1:30 PM

ప్రభుత్వ వేలంలో కోకాపేట భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందన్నారు కేసీఆర్‌. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు ముఖ్యమంత్రి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతుందంటున్నారు సీఎం కేసీఆర్‌. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో విలువ అంచనాలకు అందని విధంగా పెరిగిపోయింది. పెరుగుతున్న జనాభా, కంపెనీల రాకతో నూతన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి వస్తోంది. ఇప్పటికే నగరం నలుదిశలా నిర్మాణ, పారిశ్రామిక నిర్మాణాలు జరుగుతుండగా, ఐటీ కారిడార్ పరిధి అంతకంతకు విస్తరిస్తుంది.

కార్పొరేట్‌ దిగ్గజ కంపెనీల చూపంతా హైదరాబాద్‌ వైపే ఉంది. దీంతో కొత్త ఆఫీసులకు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది! మంచి వసతులు, సెక్యూరిటీకి ఫిదా అయి దేశ, విదేశాల నుంచి కంపెనీలు, స్టార్టప్‌‌లు భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో భారీ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌లలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టింది. 9.5 ఎకరాల్లో అమెజాన్ ఆఫీస్‌ ఇక్కడే ఉంది. ఇది అమెరికా తర్వాత అతిపెద్ద ఆఫీస్‌. ఇక 54 ఎకరాల్లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసింది. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ఇక్కడే ఉంది. ఇండియాలో పెద్ద గూగుల్‌ క్యాంపస్.. హైదరాబాద్‌లో 7.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఐకియా 13 ఎకరాల్లో అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌కు ఉన్న మరో అడ్వాంటేజ్‌.. అంతర్జాతీయంగా వచ్చిన గుర్తింపు. ఈ మెట్రోపాలిటిన్ సిటీకి అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే పచ్చదనం పెంపుపై వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతోపాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డులను దక్కించుకుంది. మరోవైపు ఈవోడీబీలో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వాన్ని అవార్డు వరించింది. ఇక ఆఫీస్‌ నిర్మాణానికి అనువైన లొకేషన్‌లోనూ హైదరాబాద్‌కు అవార్డు లభించింది.

మరోవైపు కోకాపేటలోని నియోపోలిస్ లే అవుట్ ఉన్న ఏరియాకు వెళ్తే.. హైదరాబాద్‌లో ఉన్నామా లేక.. హాంకాంగ్, న్యూయార్క్ సిటీలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మౌలిక సదుపాయాల విషయంలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసమే ప్రభుత్వం 300 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ధగధగా మెరిసిపోయే రోడ్లు… స్ట్రీట్ లైట్లు, పార్కులు, ఒక్కటేంటి.. నియోపోలిస్ లే అవుట్ నభూతో న భవిష్యతి అన్నట్టు ఉంటుంది. అందుకే ఆ భూములను దక్కించుకునేందుకు బడావ్యాపారులు క్యూ కట్టారు. బిజినెస్, రెసిడెన్షియల్ వెంచర్‌కు ఇక్కడ మరే ప్రాంతంలో లేనంత డిమాండ్ ఉంది. అందుకే కోకాపేట భూములు కేకపుట్టిస్తున్నాయి.. హై క్వాలిటీ హౌసింగ్, కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ సెంటర్స్ ఇలా వరల్డ్ క్లాస్ సిటీని తలపించే నిర్మాణాలు భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నాయి.

భౌగోళికంగా హైదరాబాద్ నగరానికున్న ప్రాధాన్యత.. వరల్డ్ క్లాస్ సిటీగా ఎదుగుతున్న తీరు కారణంగా.. ప్రభుత్వ భూమి ఎక్కడున్నా.. అది హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ప్రభుత్వం కూడా అధునీకతను జోడించి సిటీ రూపురేఖలను మార్చేస్తుంది. విలువైన భూములు కార్పొరేట్ చేతుల్లోకి వెళితే.. ఇక ప్రాంతానికి రెక్కలెచ్చినట్టే.. ఓవైపు అభివృద్ధి కనిపిస్తుంది..మరోవైపు ఖజానా కూడా నిండుతుంది.. అందుకే కోకాపేట భూములు తెలంగాణ ప్రభుత్వానికి అక్షయపాత్రగా మారాయి.

ఓ వైపు గండిపేట చెరువు, మరో వైపు ఔటర్‌ రింగు రోడ్డు.. అక్కడి నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌. కనుచూపు మేరలో ఆకాశహర్మ్యాలు.. చుట్టూ గేటెడ్‌ కమ్యూనిటీలు.. మధ్యలో కోకాపేట చెరువు.. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు కోకాపేట నియోపొలిస్‌ చుట్టూ కనువిందు చేస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌ ఇప్పుడు హైదరాబాద్‌ మహానగరంలో సరికొత్త హాట్‌స్పాట్‌గా మారింది. 41 ఎకరాల్లో నియోపోలీస్‌ను అభివృద్ధి చేసింది తెలంగాణ ప్రభుత్వం. మినిమం 3.60 ఎకరాలు, మ్యాగ్జిమమ్ -9.71 ఎకరాలు సైజ్‌తో 7 ప్లాట్లు డెవలప్‌ చేసింది. ఇక్కడ వేసిన 36 మీ., 45 మీ., వెడల్పు గల రోడ్లు ప్రాజెక్ట్‌కే స్పెషల్ హైలైట్. నియోపోలీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 300 కోట్ల పెట్టుబడి పెట్టింది. కోకాపేట సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉండటం.. రెసిడెన్షియల్ పరంగా అత్యంత అనువైన స్పాట్‌గా నగరవాసులు, రెయల్టర్లు భావిస్తున్నారు.

విలాసవంతమైన, ప్రశాంతమైన జీవనశైలిని కోరుకునేవారికి ఓ చక్కని గమ్యస్థానంగా నిలుస్తుంది కోకాపేట్‌. భౌగోళికంగా మంచి ప్లేస్ లో ఉంది. ముంబై, నాగ్‌పూర్‌, వరంగల్‌, విజయవాడ, శ్రీశైలం, బెంగళూరు.. ఈ అన్ని నగరాలకు వెళ్లేందుకు కనెక్షన్‌ ఉంది. ఎయిర్‌ వేస్, ఔటర్ రింగ్‌ రోడ్డు అందుబాటులో ఉంది, త్వరలో మెట్రో రాబోతుందంటూ ఈ మధ్యే కేటీఆర్ ప్రకటించారు. కోకాపేట నియోపొలిస్‌కు హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల నుంచి అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. నియోపొలిస్‌ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాల్లో రీచ్‌ కావొచ్చు. 20 నిమిషాల్లో సెంటర్‌ ఏరియాస్‌కు చేరుకోవచ్చు. ఎయిర్‌ పోర్ట్‌కు 20 నిమిషాలు, హైటెక్ సిటీకి 20 నిమిషాలు, హుస్సేన్‌ సాగర్‌కు 40 నిమిషాలు, రామోజీ ఫిల్మ్‌ సిటీకి దాదాపు గంటలో చేరుకోవచ్చు. కనెక్టివిటీ, ఫ్రెండ్లీ నేచర్, ఈజీ డెస్టినేషన్.. వాట్ నాట్‌.. కోకాపేట. అందుకే ఎకరం భూమి సెంచరీ మార్క్‌ దాటింది.