AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khairatabad Ganesh: బడాగణపతి దర్శనానికి నేడే చివరి రోజు.. విపరీతమైన రద్దీ.. మఫ్టీలో షీ టీమ్స్

ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. ఆదివారం కావడంతో.. భక్తులు ఫ్యామిలీతోసహా వచ్చి బడా గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిసి కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు.

Khairatabad Ganesh: బడాగణపతి దర్శనానికి నేడే చివరి రోజు.. విపరీతమైన రద్దీ.. మఫ్టీలో షీ టీమ్స్
Khairatabad Ganesh
Peddaprolu Jyothi
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 15, 2024 | 11:34 AM

Share

మహాగణపతి దర్శనానికి నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఆదివారంతో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు నిలిపివేయనునన్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. శోభయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఆదివారం బడా గణపతిని దర్శించుకోవడానికి చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.  దీంతో క్యూ లైన్స్ అన్నీ కిక్కిరిశాయి. భక్తులు రాకతో..  ఖైరతాబాద్లో మెట్రో స్టేషన్,  టెలిఫోన్ భవన్, ఐ మాక్స్ వైపు మార్గాల్లో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని..  ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ మోనిటరింగ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను భక్తులకు పంచిపెట్టనున్నారు.  సెప్టెంబర్ 17న శోభాయాత్ర తర్వాత… హుస్సేన్ సాగర్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది.

ఆకతాయిలపై డేగ కన్ను…

ఖైరతాబాద్‌ మహాగణపతి దగ్గర రెచ్చిపోతున్న ఆకతాయిల పనిపడుతున్నారు షీ టీమ్ బృందాల పోలీసులు. ఖైరతాబాద్ గణపయ్యను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తుండగా.. సందట్లో సడేమియా అన్నట్లుగా కొందరు పోకిరీలు వికృతి చేష్టలకు పాల్పడుతుండడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్‌ పెడుతున్నారు షీ టీమ్‌ బృందాల పోలీసులు. ఖైరతాబాద్‌లో వారం రోజుల్లో 285మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. భక్తులపై వికృతి చేష్టలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మహాగణపతి దగ్గర షీ టీమ్‌ బృందాలు నిరంతరం మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పక్క ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పోకిరీలను పట్టుకుంటున్నారు పోలీసులు. వికృతి చేష్టలకు పాల్పడేవారిపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు. అలాగే.. పోకిరీలతో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.

నిమజ్జనాల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్…. 

వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జనాలు కూడా అంతే వేడుకగా జరుపుతారు. గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఈనెల 17న ఖైరతాబాద్ మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరుగనున్నాయి.

ఇందుకోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్‌ నిమజ్జనానికి 17వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ . అన్ని శాఖల సమన్వయంతో గణేష్‌ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు.

భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. గణనాథుల శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్‌ బాజాలతో దద్దరిల్లుతుండగా.. భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర జరుగుతోంది. నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడే కనిపిస్తోంది. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.