AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్ఎస్‎కు వరుసగా ఎదురుదెబ్బలు… అక్కడి వాస్తు దోషమే కారణమా..?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో కేసీఆర్ వాస్తు మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్‌ కు వాస్తు దోషం ఉందని కొందరు పండితులు చెప్పిన మాటలను విశ్వసించి కీలక మార్పులు చేస్తున్నారు.

Telangana: బీఆర్ఎస్‎కు వరుసగా ఎదురుదెబ్బలు... అక్కడి వాస్తు దోషమే కారణమా..?
Telangana Bhavan
Srikar T
|

Updated on: Apr 05, 2024 | 2:10 PM

Share

హైదరాబాద్, ఏప్రిల్ 05: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో కేసీఆర్ వాస్తు మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్‌ కు వాస్తు దోషం ఉందని కొందరు పండితులు చెప్పిన మాటలను విశ్వసించి కీలక మార్పులు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు శాసనసభ్యులు వలసలు వెళ్లిపోవడంతో, కేసీఆర్ తనయకు కోర్టు చిక్కులు, అరెస్టులు ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి.ఈ తరుణంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వాస్తుపై మొగ్గు చూపుతున్నారు. బంజారాహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ప్రధాన ప్రవేశ ద్వారం వాస్తుకు అనుగుణంగా మార్చే పని మొదలైంది. వాయువ్య కాంపౌండ్‌లోని ప్రవేశ ద్వారం మూసివేయబడుతుంది. దీనిని ఈశాన్య వైపున సిద్ధంగా ఉన్న మరొక గేటు నుంచి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి.

కేసీఆర్ జోతిష్యాన్ని, వాస్తును, దైవాన్ని బలంగా నమ్ముతారు. గతంలో అనేక యజ్ఙాలు, యాగాలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న, గతంలో అంగరంగ వైభవంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయం కూడా వాస్తు ఆధారంగానే నిర్మించారు. అయితే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలకు తెలంగాణ భవన్‌లోని ప్రవేశ మార్గంలో ఏర్పడిన వాస్తు దోషమే ఒక కారణమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. పైగా దీనిపై పలువురు సిద్దాంతుల అభిప్రాయాలను కూడా సేకరించి దోషాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ భవనానికి ఈశాన్యం వైపు గేటు వద్ద ర్యాంప్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో ‘వీధి పోటు’ లేదా టి-జంక్షన్ ఉన్నందున, భవనం వెలుపల ఒక పాయింట్ వద్ద మూడు రోడ్లు కలిసే విధంగా, దానిని మార్చడానికి మార్పులు చేస్తున్నారు.

వాస్తుపై గట్టి నమ్మకం ఉన్న కేసీఆర్, తాను సీఎంగా ఉన్న సమయంలో కేవలం డజను సార్లు మాత్రమే సచివాలయానికి వెళ్లి వాస్తు సరిగా లేదని భావించి, తన క్యాంపు కార్యాలయం, నివాసం ‘ప్రగతి భవన్‌’లో పనిచేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత 2023 డిసెంబర్‌లో బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులతో సహా పలువురు శాసనసభ్యులు లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీని వీడారు. కేసీఆర్ కు దగ్గరగా ఉన్న కీలక నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికార కాంగ్రెస్, బీజేపీ ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని భావిస్తున్నాయి. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ కూడా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇలా వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా వాస్తు దోషాన్ని తొలగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..