AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మండే వేసవిలో వన్య మృగాల సంరక్షణ.. జూలో ప్రత్యేక ఏర్పాట్లు..

హైదరాబాద్ జూలో జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గడ్డిపై నీటి తుంపర్లద్వారా చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. వన్యమృగాలకు వేసవి తాపం తగలకుండా ప్రత్యేకంగా కూలర్లు ఏర్పాటు చేశారు. భగభగమందుతున్న ఎండలకు జనం అల్లాడిపోతున్నారు.

Hyderabad: మండే వేసవిలో వన్య మృగాల సంరక్షణ.. జూలో ప్రత్యేక ఏర్పాట్లు..
Hyderabad Zoo Park
Srikar T
|

Updated on: Apr 05, 2024 | 1:27 PM

Share

హైదరాబాద్ జూలో జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గడ్డిపై నీటి తుంపర్లద్వారా చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. వన్యమృగాలకు వేసవి తాపం తగలకుండా ప్రత్యేకంగా కూలర్లు ఏర్పాటు చేశారు. భగభగమందుతున్న ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. రోడ్లమీద ప్రయాణించే జనం ఎక్కడ చిన్నపాటి నీడ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నారు. ఏసీలు, కూలర్లు, శీతల పానీయాలు అంటూ రకరకాల మార్గాల వైపు చూస్తున్నారు. మనుషుల సంగతే ఇలా ఉంటే.. మరి జంతువుల సంగతి ఏంటి..? ప్రస్తుతం హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్న జంతువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంది. రాయల్‎గా కనిపించే బెంగాల్ టైగర్లు, గర్జనలతో రాజసంగా కనిపించే సింహాలు ఎండ వేడిమికి నిలువునా ఒరిగిపోతున్నాయి. వీటిని రక్షించేందుకు జంతు ప్రదర్శనశాలలో సిబ్బంది అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. వాటిపై ఏమాత్రం ఎండ ప్రభావం పడకుండా కింద ఇసుక వేసి ప్రతినిత్యం వాటిపై నీళ్లు చల్లుతున్నారు. మరోవైపు జంతువులు డిహైడ్రేట్ కాకుండా గ్లూకోజ్ వంటి పానీయాలను వాటికి అందిస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలను తట్టుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక కూలర్లు ఏర్పాటు చేశారు. జంతువులకు ఎండ వేడిమి తగలకుండా ఉండేందుకు అవసరమైనన్ని చర్యలు చేపడుతున్నారు.

జంతువులు నివసించే బోన్ల పరిసర ప్రాంతాల్లో 200లకు పైగా వాటర్ స్ప్రింక్లర్లను, చిన్న పాటి రెయిన్ గన్ లను ఏర్పాటు చేశారు. సూర్యుని వేడిమి తగలకుండా తుంగ గడ్డితో 6 అంగుళాల మందంతో పై కప్పులను తయారు చేశారు. వాటిపై నీటి బిందువులు పడేలా ఏర్పాట్లు చేశారు. వీటి దగ్గరకు వచ్చి ఎలుగు బంట్లు సేదతీరుతున్నాయి. దీంతో జంతువులు నివసించే ప్రాంతమంతా చల్లగా మారిపోయింది. పైగా కూలర్లు ఏర్పాటు చేయడంతో ఎండ తీవ్రత వాటిపై తగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జూలో ఉన్న జంతువులు, పక్షులు, సాదుజీవులు ఈ వేసవిని తట్టుకునేలా వాటి సంక్షేమం కోసం తగిన ఏర్పాట్లను చేశామని క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ తెలిపారు. వేసవి కావడంతో పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగిందన్నారు. ఇక్కడికి వచ్చిన పాఠశాల పిల్లలకు జంతువుల పరిరక్షణపై అవగాహనా కర్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. వన్యప్రాణులను ఎలా సంరక్షించుకోవాలో వారికి వివరిస్తున్నట్లు తెలిపారు. అరుదైన అటవీ జంతువుల సంపదను ఎలా కాపాడుకోవాలో వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…