Hyderabad Water Board: అక్రమంగా అదనపు నల్లా కనెక్షన్లు గుర్తింపు.. ఏడుగురిపై కేసు నమోదు
Hyderabad Metropolitan Water Supply : హైదరాబాద్ జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా అదనపు నల్లా కనెక్షన్లు పొందిన ఏడుగురి మీద..
Hyderabad Metropolitan Water Supply : హైదరాబాద్ జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా అదనపు నల్లా కనెక్షన్లు పొందిన ఏడుగురి మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ చింతల్ బస్తికి చెందిన గౌరయ్య, శ్రీలత, నీలమ్మ, దినేష్ సింగ్, జె. మల్లయ్య, నర్సమ్మ, డి. మల్లేష్ లపై కేసు నమోదైంది. అయితే ఇంతకుముందే 6 అంగుళాల వ్యాసార్థం గల పైపులైన్ కు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలోనే తాగునీటి సరఫరాను మరింత విస్తరించే క్రమంలో జలమండలి అధికారులు ఇటీవల మరో 10 అంగుళాల వ్యాసార్థం గల ఫీడర్ మెయిన్ పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. కాగా సదరు వ్యక్తులు వారి పైపులైన్ కు లో ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతుందనే నెపంతో.. జలమండలి ఇటీవల నూతనంగా నిర్మించిన 10 అంగుళాల పైపులైన్ కు అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఆరు ఇండ్ల యజమానులు మొత్తం ఎనిమిది అదనపు కనెక్షన్లను తీసుకున్నారు. దీని వల్ల సమీప ప్రాంతాల్లో కలుషిత నీరు రావడం, దానిమీద పలుమార్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి ఆరు ఇళ్ల యజమానులతో సహా మొత్తం ఏడుగురిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో యు / ఎస్ 269, 430, 379 ఐపీసీ సెక్షన్లు, ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందంకు లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని వారు కోరారు.