
హైదరాబాద్ ఉప్పల్‌లో కలకలం రేపిన డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రీకొడుకుల్ని హతమార్చిన వినాయక్‌రెడ్డి, బాలకృష్ణలను హైదరాబాద్ పోలీసులు ఏపీలోని విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా.. డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నర్సింహ్మ శర్మ పూజలు చేయడంతో తమకు ఆరోగ్యం చెడిపోయిందని.. అందుకే చంపామని విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
ఈ నెల15న ఉదయం నర్సింహ్మా శర్మ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు వ్యక్తులు కత్తులతో స్వైరవిహారం చేశారు. ఆయనపై దాడి చేస్తుండగా కొడుకు శ్రీనివాస్ అడ్డుకోబోయాడు. దీంతో ఇద్దర్ని కలిపి చంపేశారు. ఆస్థి తగాదాలే తండ్రీకొడుకుల్ని మట్టుబెట్టాయని భావించారంతా. అయితే స్పాట్‌లో పసుపు, కుంకుమతో కూడిన బ్యాగ్ దొరకడంతో పోలీసులు అనుమానించి ఆ దిశగా కేసును దర్యాప్తు చేశారు.
మరోవైపు ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి మర్డర్ మిస్టరీ ఛేదించారు. శ్రీనివాస్ ఒంటిపై మొత్తం 29కత్తిగాట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఫైనల్‌గా క్షుద్రపూజలే జంట హత్యలకు కారణమని తేల్చారు పోలీసులు..
నర్సింహా క్షద్ర పూజలతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తండ్రీకుమారుడిని హత్య చేసిన ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..