MUNUGODU BY-ELECTION: రసకందాయంలో మునుగోడు ఉప ఎన్నిక.. ప్రధాన పార్టీలకు మూడు ప్రధాన సమస్యలు.. డీల్ చేసేందుకు సరికొత్త వ్యూహాలు

మునుగోడు ఉప ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ పర్వం ముగియడంతో బరిలో ఎందరున్నారనేది తేలిపోయింది. ఇలాంటి కీలక సమయంలో మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మూడు ప్రధాన సమస్యలొచ్చిపడ్డాయి.

MUNUGODU BY-ELECTION: రసకందాయంలో మునుగోడు ఉప ఎన్నిక.. ప్రధాన పార్టీలకు మూడు ప్రధాన సమస్యలు.. డీల్ చేసేందుకు సరికొత్త వ్యూహాలు
Rajgopal, Kusukuntla, Sravanti
Follow us

|

Updated on: Oct 18, 2022 | 2:55 PM

మునుగోడు ఉప ఎన్నికను గమనిస్తున్న వారికి మస్తు మజా అనిపిస్తోంది. పాపం ఎలాగైనా సీటు దక్కించుకోవాలనుకుంటున్న ప్రధాన పార్టీలను మాత్రం తీవ్రమైన వర్రీకి గురిచేస్తోంది. మొన్నటి వరకు బోగస్ ఓటర్ల అంశంపై రచ్చ కొనసాగితే.. తాజాగా అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు (సింబళ్ళు), ఎంత మనీ ఇచ్చి కొన్నా తమతో చివరికంటా వుంటారో వుండరో తెలియని లోకల్ లీడర్స్, క్యాడర్స్.. దీనికి తోడు అందరి వద్దా మనీ తీసుకుంటూ ఏ పూటకా పాట పాడుతున్న ఓటర్లు.. ఇలా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కలవరపాటుకు గురి చేస్తున్న అంశాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మూడంశాలతో వర్రీ అవుతున్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీది కాస్తంత భిన్నమైన పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ పోటాపోటీగా లోకల్ ‘టాలెంట్’ని కొనుగోలు చేస్తుండగా ఏతావాతా కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో మైనస్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇందుకు తాజాగా బూర నర్సయ్య గౌడ్ వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో దాదాపు 35 వేల ఓట్లున్న గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బూర నర్సయ్య టీఆర్ఎస్ పార్టీకి దూరం కాగానే గులాబీ పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పల్లె రవికి గాలమేసింది. బూర ఇంకా బీజేపీలో చేరనే లేదు.. కానీ పల్లెను పక్కలోకి తీసుకుంది గులాబీ పార్టీ. అంటే బీజేపీకి ఓ ఎంపీ స్థాయి నేత అదనంగా యాడ్ కాగా.. టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ స్థాయి నేత దూరమై.. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడిన ఇంకో నేత జత కలిశాడు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓ ఎంపీపీ ప్రెసిడెంటును, ఆమె భర్తను కోల్పోయింది. ఏతావాతా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. ఇదిలా వుంటే.. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతికి మరో సమస్య వచ్చిపడింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిగి వున్న భువనగిరి లోక్‌సభ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అస్సలు ప్రచారానికి రావడం లేదు. పైగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. అక్టోబర్ 17న గాంధీభవన్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట రెడ్డిని స్రవంతి స్వయంగా వేడుకున్నారు. ఆమె నెత్తిమీద చేతి పెట్టి మరీ ఆశీర్వదించిన వెంకటరెడ్డి.. ప్రచారానికి వెళ్ళేది లేనిది మాత్రం ఇదమిత్తంగా తేల్చలేదు. పైగా ఆ తర్వాతే మరోసారి రేవంత్ రెడ్డిపైన సెటైర్లు వేశారు. ‘‘మునుగోడు ప్రచారంలో ఎస్పీ స్థాయి వ్యక్తులుండగా తనలాంటి హోంగార్డులు, కానిస్టేబుళ్ళ అవసరం ఏంటి’’ అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన మాటలనే వెంకటరెడ్డి సెటైర్లుగా వాడుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న తనలాంటి వారిని పక్కన పెట్టి ఈ మధ్యే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షున్ని చేయడాన్ని అప్పట్లో వెంకట్‌రెడ్డి తప్పు పట్టారు. ఆనాటి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘తాను జిల్లా ఎస్పీపోస్టుకు డైరెక్టుగా ఎంపికైన ఐపీఎస్ లాంటి వాడినని.. సుదీర్ఘకాలం పని చేసినా హోంగార్డును ఎస్పీలు కాలేరు’’ అని అప్పట్లో వెంకటరెడ్డికి రేవంత్ చురకంటించారు. ఆ చురకనే ఇపుడు వెంకట్‌రెడ్డి ఉటంకించారు. మునుగోడు ప్రచారంలో ఎస్పీ స్థాయి వారుండగా హోంగార్డు, కానిస్టేబుల్ లాంటి తన పనేంటని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమవుతుండగా.. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల గుర్తులు, జంప్ జిలానీల విషయంలో వర్రీ అవుతున్నారు. ఎంతో కొంత ఓటు బ్యాంకు చేతుల్లో వుందనుకున్న వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ స్థాయి నేత దాకా లక్షలకు లక్షలు ఆఫర్ ఇచ్చిన పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. తీరా వారు పార్టీలో చేరినా పోలింగ్ ముగిసే దాకా తమతోనే వుంటారా లేరా అన్న మీమాంస తాజాగా మొదలైంది. ఇందుకు కారణం ఓ పేరున్న లీడర్లు సైతం పొద్దున్నా, సాయంత్రానికి పార్టీలు మారుతున్న పరిస్థితి మునుగోడులో కనిపిస్తోంది. ఇక పెద్దగా పేరులేని వార్డు మెంబర్లు, ఎంపీటీసీల సంగతైతే చెప్పనక్కరే లేదు. ఈ క్రమంలో ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని ఒకే మొత్తంలో చెల్లించేందుకు అభ్యర్థులు, పార్టీలు సుముఖత ప్రదర్శించడం లేదు. ఎందుకంటే ఏకమొత్తంలో చెల్లించిన తర్వాత వారు పార్టీలో వుంటారో లేక మరింత మొత్తం ఇస్తామన్న మరో పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈక్రమంలో పార్టీలు మారిన జంప్ జిలానీలు కూడా తమకు పార్టీలు, అభ్యర్థులు ఇస్తామన్న మొత్తం ఎన్నికలయ్యే దాకా ఆగితే ఇస్తారో ఇవ్వరో అన్న వర్రీకి గురవుతున్నారు. ఇక ఓటర్లు గుట్టుగా వ్యవహరిస్తుండడంతో కూడా వారి నాడి అర్థం కాక ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అందరి దగ్గరా మనీ తీసుకుంటాం కానీ ఎవరికి ఓటేయాలో వారికే వేస్తాం అంటున్న మునుగోడు ఓటర్ల వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఎంత మనీ ఇచ్చినా తమకే ఓటు వేస్తారన్న గ్యారెంటీ లేదని ప్రధాన పార్టీల నాయకులు అంతరంగిత భేటీల్లో వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఇక టీఆర్ఎస్, బీజేపీలకు.. ఇంకాస్త క్లారిటీతో చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల గుర్తుల అంశం పెద్ద సమస్యగా తయారైంది. గతంలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయావకాశాలను తారుమారు చేసిన కారు గుర్తును పోలి వున్న రోడ్డు రోలర్, బుల్‌డోజర్ వంటి గుర్తులను ఇపుడు ఈ తాజా ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించింది. ఈ కేటాయింపును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజునే తమ పిటిషన్‌ని విచారించాలంటూ అక్టోబర్ 17వ తేదీన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు గులాబీ నేతలు. కానీ, కోర్టు వెంటనే విచారించేందుకు సుముఖత వ్యక్తం చేయకుండా మర్నాడు అంటే అక్టోబర్ 18 వతేదీన టీఆర్ఎస్ నేతల పిటిషన్‌ని విచారించింది. కానీ, హైకోర్టు తీర్పు గులాబీ నేతలకు ప్రతికూలంగా వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరపెట్టిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. దాంతో టీఆర్ఎస్ ముందు ఇపుడు ఓటర్లను తమ కారు గుర్తు మీద మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత పడింది. ఈ సమస్య బీజేపీకి కూడా వున్నప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత స్థాయిలో ఇబ్బంది లేదనే చెప్పాలి. ఇక ఇక్కడో రాజకీయ వైరం కూడా కనిపిస్తోంది. రోడ్డు రోలర్, బుల్ డోజర్ వంటి గుర్తులను దశాబ్ధం తర్వాత మళ్ళీ కేటాయించడం వెనుక ఎన్నికల సంఘంపై బీజేపీ ఇన్ఫ్లూయెన్స్ పని చేసిందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తమ్మీద నామినేషన్ల పర్వం ముగిసి, బరిలో 47 మంది (బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్; బీఎస్సీ సహా మరో పది చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు, 33 మంది ఇండిపెండెంట్లు) నిల్వడం ఖాయమైన తరుణంలో ప్రచార పర్వం మరింత వేడెక్కబోతున్న తరుణమిది. ఇలాంటి కీలక సమయంలో కొత్తగా వేధిస్తున్న అంశాలను డీల్ చేసే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు.