ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో మరో వన్‌వే.. ఈ ప్రాంతాల్లో ట్రయల్ రన్‌కు డేట్ ఫిక్స్!
Hyderabad Lakdikapul One-Way: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు లక్డీకాపూల్‌లో నూతన ట్రాఫిక్ విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. లక్డీకాపూల్‌లో వన్ వే సాధ్యాసాధ్యాలపై కసరత్తు ముమ్మరం చేశారు. మొదట ప్రయోగాత్మకంగా అమలు చేశాక, ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ ఇతర అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే.. కేబీఆర్ పార్క్ వన్‌వే విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో మరో కీలక ప్రాంతంలోనూ వన్‌వే అమలుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురయ్యే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కొత్త వన్‌వే విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రవీంద్రభారతి – లక్డీకాపూల్ – ఇక్బాల్ మినార్ జంక్షన్ల మధ్య వన్‌వేను పెట్టాలనుకుంటున్న అధికారులు.. నవంబర్ 22న ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ఇతర అధికారులతో కలిసి స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి ప్రతిపాదిత వన్‌వే మార్గాలపై సూచనలు చేశారు.
ఓల్డ్ కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ల మధ్య వాహనాల రాకపోకలను మళ్లించేలా మూడు కీలక మార్గాలను ప్రతిపాదించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి తొలుత ప్రయోగాత్మకంగా వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. ట్రయల్ రన్‌కు ముందే స్థానిక వ్యాపారులు, నివాసితులు, నిత్య ప్రయాణికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాల ఉంటే స్వీకరించి.. అవసరమైన మార్పులు చేస్తారు.
వాహనాల రద్దీ, ప్రయాణ సమయం, ట్రాఫిక్ వేగంపై సమగ్ర డేటాను సేకరిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండటంతో పాటు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా చేసేలా చూస్తున్నారు. మరోవైపు కేబీఆర్ పార్క్ దగ్గర ఇప్పటికే అమల్లో ఉన్న వన్‌వే మార్గాన్ని పరిశీలించిన సీపీ.. పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు అదనంగా మరో ట్రాఫిక్ లేన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భూగర్భ పైపులైన్లు, విద్యుత్ స్తంభాలను తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా, @CommissionrGHMC గారితో కలిసి స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించాను.
లక్డీకాపూల్ పరిసరాల్లో ప్రతిపాదిత వన్ వే నూతన విధానాన్ని నవంబర్ 22న (ఆదివారం) ప్రయోగాత్మకంగా ఒక్క రోజు ట్రయల్ రన్ అమలు చేయనున్నాం.
కూడళ్ల వద్ద నిరీక్షణ సమయం తగ్గించి, ఇంధనం ఆదా చేయడమే లక్ష్యంగా… స్థానికుల సలహాలు, సాంకేతిక నిపుణుల డేటా ఆధారంగానే దీని కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకుంటాం.
నగరవాసులకు మరింత సురక్షితమైన, సాఫీ ప్రయాణాన్ని అందించేందుకు చేపడుతున్న ఈ ట్రయల్ రన్‌కు ప్రజలంతా సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
#HyderabadTraffic #Lakdikapool #TrafficUpdate #HyderabadCityPolice
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) November 9, 2026
