AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 120 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నవంబర్ 18 చివరి తేదీ!

ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) షార్ట్ సర్వీస్ కమిషన్ కింద 120 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 18, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి కెప్టెన్ హోదాతో పాటు నెలకు రూ.61,300 బేసిక్ పే, రూ.15,500 మిలిటరీ సర్వీస్ పే, ఇతర అలవెన్సులు లభిస్తాయి..

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 120 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నవంబర్ 18 చివరి తేదీ!
AFMS Medical Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 10, 2026 | 7:53 AM

Share

వైద్య విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వైద్యులకు శుభవార్త. భారత సాయుధ దళాల వైద్య సేవల విభాగం (Armed Forces Medical Services – AFMS) షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) విధానంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుష అభ్యర్థులకు 90 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 30 పోస్టులు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ను నవంబర్ 7, 2026న విడుదల చేశారు. దరఖాస్తులకు నవంబర్ 18, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు కెప్టెన్ హోదాలో సాయుధ దళాల వైద్య సేవల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది.

మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షను గరిష్ఠంగా రెండు ప్రయత్నాల్లోపు ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లేదా నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ను 2026 సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి ఉండాలి. NEET PG 2025 లేదా NEET PG 2026 పరీక్షకు హాజరై ఉండాలి. పీజీ వైద్య డిగ్రీలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎంబీబీఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. 1997 జనవరి 2న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. పీజీ వైద్య డిగ్రీ ఉన్న అభ్యర్థులకు 35 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. 1992 జనవరి 2న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. 2026 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 18, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200గా నిర్ణయించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజు కింద రూ.200 చొప్పున ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

AFMS మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు. అభ్యర్థులు సాధించిన NEET PG పర్సంటైల్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ స్కోర్లను 200 మార్కులకు అనుగుణంగా మార్చి ఎంపిక ప్రక్రియ చేపడతారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా వైవా నిర్వహిస్తారు. దీనికి మొత్తం 50 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు పొందాలి. NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ మూల్యాంకనంలో గరిష్ఠంగా మూడు మార్కుల వరకు వెయిటేజీ లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రత్యేక మెడికల్ బోర్డు ముందు వైద్య పరీక్షలకు హాజరుకావాలి. సాయుధ దళాల వైద్య సేవలకు అవసరమైన వైద్య ప్రమాణాలను అభ్యర్థులు అందుకోవాలి. అభ్యర్థుల విద్యార్హతలు, వయస్సు, ఇంటర్న్‌షిప్, మెడికల్ రిజిస్ట్రేషన్ తదితర ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారు. NEET PG మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 2026 డిసెంబర్ 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రెఫరల్), ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు నిర్ణీత తేదీకి కనీసం వారం రోజుల ముందుగా అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

జీతభత్యాలు ఎంతంటే?

ఎంపికైన అభ్యర్థులను కెప్టెన్ (Captain) హోదాలో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియమిస్తారు. బేసిక్ పే: రూ.61,300, మిలిటరీ సర్వీస్ పే (MSP): రూ.15,500తోపాటు ఇతర వర్తించే అలవెన్సులు కూడా అదనంగా అందిస్తారు. అంటే బేసిక్ పే, మిలిటరీ సర్వీస్ పే కలిపి నెలకు రూ.76,800 లభిస్తుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 7, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 18, 2026
  • ఇంటర్వ్యూల ప్రారంభం: డిసెంబర్ 2, 2026

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us