AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. తీరనున్న తాగునీటి కష్టాలు.. యుద్ధప్రాతిపదికన పనులు!

హైదరాబాద్‌ మహానగర ప్రజలకు తాగునీటి కష్టాలు తగ్గించే దిశగా జలమండలి కీలక చర్యలు చేపట్టింది. నగరానికి గోదావరి అదనపు జలాలను తరలించే పనులను వేగవంతం చేసింది. ఈ నెల 15వ తేదీలోగా ఘన్‌పూర్‌ వద్ద పైప్‌లైన్‌ అనుసంధాన పనులను పూర్తి చేసి, రోజుకు 40 మిలియన్‌ గ్యాలన్ల (40 MGD) గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. తీరనున్న తాగునీటి కష్టాలు.. యుద్ధప్రాతిపదికన పనులు!
HMWSSB Hyderabad Water Supply
Balaraju Goud
|

Updated on: Nov 10, 2026 | 7:16 AM

Share

హైదరాబాద్‌ మహానగర ప్రజలకు తాగునీటి కష్టాలు తగ్గించే దిశగా జలమండలి కీలక చర్యలు చేపట్టింది. నగరానికి గోదావరి అదనపు జలాలను తరలించే పనులను వేగవంతం చేసింది. ఈ నెల 15వ తేదీలోగా ఘన్‌పూర్‌ వద్ద పైప్‌లైన్‌ అనుసంధాన పనులను పూర్తి చేసి, రోజుకు 40 మిలియన్‌ గ్యాలన్ల (40 MGD) గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ క్రమంలో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి గోదావరి పథకం పనుల పురోగతిని పరిశీలించారు. పైప్‌లైన్‌ అనుసంధాన పనులను రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు కార్మికులను నియమించి, యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

రోడ్డు క్రాసింగ్‌ పనులకు ప్రాధాన్యత

పైప్‌లైన్ల అనుసంధానంలో కీలకమైన రోడ్డు క్రాసింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ ఆదేశించారు. పైపుల తయారీ, రవాణా, ట్రెంచింగ్‌, పైపుల ఏర్పాటు, వెల్డింగ్‌, జాయింటింగ్‌ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మిషన్‌ భగీరథ, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను తాత్కాలికంగా నిలిపివేసి, అక్కడి యంత్రాలు, సిబ్బందిని అత్యవసర పనులకు వినియోగించాలని ఆదేశించారు.

రూ.7,360 కోట్లతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

హైదరాబాద్‌ భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌-2, ఫేజ్‌-3 పనులను చేపట్టారు. సుమారు రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2027 అక్టోబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు మొత్తం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించనున్నారు.

17.50 టీఎంసీలు నగర తాగునీటి అవసరాలకు..

ప్రాజెక్టు ద్వారా వచ్చే 20 టీఎంసీల నీటిలో 17.50 టీఎంసీలను హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. మిగిలిన 2.50 టీఎంసీలను ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పునరుజ్జీవనంతో పాటు మూసీ నది పునరుద్ధరణకు కేటాయించనున్నారు. ప్రస్తుతం సింగూరు, మంజీరా జలాశయాలపై ఉన్న నీటి సరఫరా ఒత్తిడిని తగ్గించడంతో పాటు నగరానికి దీర్ఘకాలికంగా తాగునీటి భద్రత కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ నెల 15 నాటికి అదనపు గోదావరి జలాల తరలింపు ప్రారంభమైతే నగర నీటి సరఫరాకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే, నిర్దేశిత గడువులో పనులు పూర్తవడం, నీటి సరఫరా వ్యవస్థతో అనుసంధానం సజావుగా జరగడంపైనే ఈ లక్ష్యం ఆధారపడి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us