Hyderabad: ఆమె ఎంత మానసిక వేదనకు గురైందో పాపం.. చివరకు ఈ నిర్ణయం..
హైదరాబాద్‌లో దారుణం… కట్నం వేధింపులు, మగబిడ్డ కోసం ఒత్తిడి తట్టుకోలేక తహేరా ఫాతిమా అనే మహిళ భవనం పై నుంచి దూకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన కారణంగా భర్త, అత్తింటివారి మానసిక హింస పెరగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

సమాజంలో మహిళ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. రాతి యుగం నుంచి వంటింటికే పరిమితమైపోయిన ఆడపిల్ల కాలక్రమేణా ఉన్నత స్థాయికి ఎదిగింది. విద్య, ఉద్యోగం, సంపాదన.. ఇలా అన్ని విషయాల్లో మగవాడికి ఏ మాత్రం తీసిపోకుండా సమాన హక్కులు పొందుతోంది. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఆడపిల్లను ఈ భూమి మీద పడనివ్వని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే మీరు నమ్ముతారా?.. ఇప్పటికీ చాలా చోట్ల వరకట్న వేధింపులకు మహిళలు బలవుతున్నారంటే ఒప్పుకుంటారా? అవును.. ఇది నిజం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపుతున్నవాళ్లు, చెత్తకుప్పల్లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తున్నవాళ్లు, కట్నం కోసం ఆడవారిని బాధ పెడుతున్నవాళ్లు ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే హైదరాబాద్ మహా నగరంలో చోటు చేసుకుంది.
ఓ 32 ఏళ్ల మహిళపై కట్నం వేధింపులు, మగబిడ్డ కోసం ఒత్తిడి కారణంగా భవనం పైనుంచి దూకిన దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్-పాతబస్తీకి చెందిన తహేరా ఫాతిమా అనే యువతి 2023, జూన్ 22న అస్గర్ హుస్సేన్ రజ్వీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పైగా ఇది అతనికి రెండో వివాహం. దంపతులు హైదరాబాద్‌లోనే ఓ అద్దె ఇంటిలో నివసిస్తుండగా.. ఇప్పటికే వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురికి రెండేళ్ల వయసు ఉండగా.. చిన్న కూతురి వయసు 8 నెలల వయసు. ఇంతవరకూ బాగానే ఉండగా.. తహేరా ఫాతిమాపై భర్త, అత్తింటివారు కొన్ని నెలలుగా కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. ఇది చాలదంటూ, మగబిడ్డని కనివ్వలేదని మానసికంగా హింసిస్తున్నారు. కాగా, ఈ వేధింపులు తట్టుకోలేక సుమారు రెండేళ్ల క్రితం ఫాతిమా ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కానీ, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఈ క్రమంలో ఇటీవలే రెండో ఆడపిల్ల పుట్టిన అనంతరం ఫాతిమాపై వేధింపులు మరింత పెరిగాయి. భర్త, అత్తింటివారు కలిసి ఆమెను తమ అద్దె ఇంటి రెండో అంతస్తు పైనుంచి కిందికి దూకేలా బలవంతం కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక మనిషిని నమ్మి పెళ్లాడి, ఓ ఇంటికి ఇల్లాలుగా వచ్చిన మహిళపై ఇంత దారుణానికి పాల్పడుతున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సమస్యలు కావడంతో పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో పూర్తి స్థాయిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేక పోతున్నారు. పైగా బాధిత మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చేసేంత స్వేచ్ఛ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కనబడడం లేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ గృహ హింస, వేధింపులకు ఒక అంతం లేకుండా పోతోంది. తాజాగా జరిగిన ఈ ఘటన మహిళలపై జరుగుతున్న గృహహింస, కట్నం వేధింపులు, లింగ వివక్షపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.. సమాజంలో మహిళ స్వేచ్ఛగా బతికే అవకాశాలు కూడా తగ్గుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
