PM Modi: శభాష్ ఆకర్షణ సతీష్.. హైదరాబాద్ బాలికను ప్రశంసించిన ప్రధాని నరేంద్రమోడీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ద్వారా అనేక విషయాలపై ప్రసంగిస్తుంటారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. అయితే, ‘మన్ కీ బాత్’ 105వ ఎపిసోడ్‌లో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీశ్‌పై ప్రశంసలు కురిపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ద్వారా అనేక విషయాలపై ప్రసంగిస్తుంటారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. అయితే, ‘మన్ కీ బాత్’ 105వ ఎపిసోడ్‌లో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీశ్‌పై ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటినుంచే సేవా భావాన్ని అలవర్చుకున్న ఆకర్షణ సతీశ్‌ను ప్రధాని మోడీ అభినందించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని ఆకర్షణ సతీష్.. లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలలో పుస్తక పఠన అలవాటును పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మొదటగా అధికారుల అనుమతితో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో పిల్లల కోసం మరో ఆరు లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆమె లైబ్రరీలలో 6,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలన్న ఆశయంతో తండ్రి డా. సతీశ్ కుమార్ ప్రోత్సాహంతో పుస్తకాలను సేకరించడం, లైబ్రరీలు ఏర్పాటు చేయడం అలవర్చుకుంది.
అయితే, చిన్న వయసులోనే సమాజానికి తన వంతు కృషి చేస్తున్నందుకు ఆకర్షణ సతీష్‌ను ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా అభినందించారు. ‘‘ఆకర్షణ సతీశ్ చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆకర్షణ సతీశ్ కృషికి నా అభినందనలు. ఆకర్షణను చూసి గర్విస్తున్నాను’’ అంటూ చిన్నారి ప్రయత్నాన్ని మోడీ అభినందించారు. గతంలో ఆకర్షణ ప్రయత్నాన్ని మెచ్చిన రాష్ట్రపతి కూడా ప్రశంసించారు. అంతేకాకుండా ఆకర్షణ లైబ్రరీలను ఏర్పాటు చేయడంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, అదనపు డీజీపీలు స్వాతి లక్రా, శిఖా గోయెల్ సహా పలువురు ఉన్నతాధికారుల ప్రశంసించారు.
ఆకర్షణ తన తల్లిదండ్రులతో కలిసి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు.. ఆసుపత్రిలోని చిన్నారుల కోసం లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అన్నదానం చేస్తున్న క్రమంలో ఆసుప్రతిలోని పిల్లలు ఆమెను కలర్ పుస్తకాలు కావాలని అడగడంతో.. అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఆసుపత్రిలోని పిల్లలకు పుస్తకాలు అందించాలన్న సంకల్పంతో ఇరుగుపొరుగు వారి నుంచి, బంధువుల నుంచి పుస్తకాలు సేకరించి తొలి లైబ్రరీని హాస్పిటల్ లో ఏర్పాటు చేసింది. ఆమె ఒక సంవత్సరం పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో 1,036 పుస్తకాలను సేకరించి.. అనంతరం లైబ్రరీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. విద్యార్థిని వివిధ ప్రదేశాలలో పిల్లల కోసం మరో ఆరు లైబ్రరీలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తోంది. 11 ఏళ్ల వయస్సులోనే ఈ చిన్నారి చేస్తున్న ప్రయత్నాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. లైబ్రరీలను ఏర్పాటు చేయడంతోపాటు.. పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..