Telangana: మొట్టమొదటి లేడీ బస్ డ్రైవర్‌కు ఉపాధి కష్టాలు.. TGSRTC ఎండీ సజ్జనార్‌కు మంత్రి రిక్వెస్ట్‌!

| Edited By: Srilakshmi C

Aug 05, 2024 | 12:15 PM

ఆమె పేరు చాలామందికి తెలియక పోవచ్చు.. కానీ దేశంలోనే మొట్టమొదటి లేడీ బస్ డ్రైవర్ అంటే వెంటనే గుర్తొస్తుంది. చదివింది పదో తరగతే అయినా.. ఢిల్లీలో ప్రగతి రథ చక్రం తిప్పుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఇప్పుడామెకు ఉపాధి కష్టాలు ఎదురయ్యాయి. ఆమె ఎవరు ఆమెకున్న కష్టాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Telangana: మొట్టమొదటి లేడీ బస్ డ్రైవర్‌కు ఉపాధి కష్టాలు.. TGSRTC ఎండీ సజ్జనార్‌కు మంత్రి రిక్వెస్ట్‌!
First Lady Driver
Follow us on

యాదాద్రి, ఆగస్టు 5: ఆమె పేరు చాలామందికి తెలియక పోవచ్చు.. కానీ దేశంలోనే మొట్టమొదటి లేడీ బస్ డ్రైవర్ అంటే వెంటనే గుర్తొస్తుంది. చదివింది పదో తరగతే అయినా.. ఢిల్లీలో ప్రగతి రథ చక్రం తిప్పుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఇప్పుడామెకు ఉపాధి కష్టాలు ఎదురయ్యాయి. ఆమె ఎవరు ఆమెకున్న కష్టాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో సీత్య తండాకు చెందిన వాంకుడోతు రాంకోటి, రుక్కా దంపతులకు ఆరుగురు సంతానం. అందరికంటే చిన్నవాడు కొడుకు. ఐదో సంతానమే సరిత. నలుగురు ఆడపిల్లల పెళ్ళికి ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మేశాడు రాంకోటి. కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో పదో తరగతి మధ్యలోనే ఆపేసి తండ్రికి చేదోడువాదోడుగా ఇంటి వద్దే ఉంది సరిత. వేసవికాలంలో దేవరకొండలోని అక్క ఇంటికి వెళ్లి ఆటో డ్రైవర్ గా ఉన్న తన బావ వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. కొన్నాళ్లకు ఆ బావ అనారోగ్యంతో చనిపోయాడు, అమ్మానాన్న, తమ్ముడి తోపాటు అక్క బాధ్యతనూ భుజానికెత్తుకుంది సరిత. దేవరకొండ ప్రాంతంలో ఆటో నడపడం మొదలు పెట్టింది. ఆకతాయిల అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చేసుకుంది. జుట్టు కత్తిరించుకుని ప్యాంటు, షర్టు ధరించి మగరాయుడిలా తయారైంది. ప్రైవేట్‌గా 10వ తరగతి పాసై సహెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్’ పొందింది. 2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్ పడితే దరఖాస్తు చేసింది సరిత. మహిళల నుంచి ఆమెది ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. కానీ, ఆడవాళ్లను డ్రైవర్‌గా తీసుకోమన్నారు అధికారులు.

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..

2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ)లో బస్సు డ్రైవర్ గా సరిత సెలక్ట్ అయ్యింది. డీటీసీ పరిధిలో 12 వేలకుపైగా బస్సు డ్రైవర్లు ఉంటే, మహిళా డ్రైవర్ సరిత ఒక్కతే. దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన ఢిల్లీలో సరిత బస్సు డ్రైవర్ గా సేవలందిస్తోంది. ‘మొట్ట మొదటి మహిళా బస్సు డ్రైవర్’ గా చరిత్ర సృష్టించిన సరిత 2018లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకుంది. 2018లో ఢిల్లీ ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం అభిలేష్ యాదవ్, కిరణ్ బేడీ చేతుల మీదుగా అవార్డులు.. 2017లో తెలంగాణ ప్రభుత్వం తరపున కుమ్రం భీం అవార్డును కూడా సరిత అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ జీవితంలో ఒంటరి ప్రయాణం చేస్తూ రోజూ వందలాది మందిని.. సరిత గమ్యస్థానాలకు చేరుస్తోంది. DTCలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సరితకు నెలకు 18 వేల రూపాయల వేతనం మాత్రమే. ఓవర్ డ్యూటీ చేసినా ఆర్ధిక ఇబ్బందులు తీరడం లేదు. సిత్యాతండాలో ఉంటున్న తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడ్డారు. తమ వద్దే ఉంటూ ఇక్కడే ఉపాధిని చూసుకోవాలని సరితపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కొడుకుగా సరిత ఉంటోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సరితకు ఇక్కడే ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

సరితకు మంత్రి కోమటిరెడ్డి భరోసా…

ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన సరిత.. స్థానికంగా తనకు ఉపాధి కల్పించాలంటూ గత పాలకులు, అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో టీవీ9 చొరవతో ప్రజాదర్బార్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సరిత కలిసింది. ఢిల్లీలో వస్తున్న వేతనం తన కుటుంబ పోషణకు సరిపోడం లేదని, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను సంరక్షించుకునేందుకు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ గా అవకాశం కల్పించాలని వేడుకుంది. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, RTC ఎండి సజ్జనార్‌లకు వీడియో కాల్ చేసి దేశంలోనే తొలి మహిళా బస్సు డ్రైవర్ సరితకు ఉపాధి కల్పించాలంటూ కోరారు. తెలంగాణ ఆర్టీసీలో సరితకు డ్రైవర్ గా అవకాశం కల్పిస్తామని, ఆమెకు అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా కోట్లాదిమంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నామని, సరితకు కూడా ఆర్టీసీ డ్రైవర్ గా ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.