AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ.. వీడు పడ్డ కథలు తెలిస్తే విస్తుపోవాల్సిందే..

సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ అమాయకులను మోసం చేసిన హ్యాబిట్యువల్ సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ మహిళా ప్రొఫైల్స్‌తో బాధితులను ట్రాప్ చేసి, అరెస్ట్ చేస్తామని భయపెట్టి యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసిన ఈ నిందితుడిపై తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 44 సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ.. వీడు పడ్డ కథలు తెలిస్తే విస్తుపోవాల్సిందే..
Sai Ram Reddy
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 6:16 PM

Share

సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటించి అమాయకులను మోసం చేసిన హ్యాబిట్యువల్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఈ యువకుడిపై మొత్తం 44 సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదై ఉండటం గమనార్హం. నిందితుడు ఫేక్ మహిళా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, ముఖ్యంగా షేర్‌చాట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో బాధితులతో పరిచయం పెంచుకునేవాడు. నమ్మకం సంపాదించిన తర్వాత వారి ఫోన్ నంబర్లు తీసుకుని, తానే సైబర్ క్రైం పోలీస్ అధికారినని నటిస్తూ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అశ్లీల ఆన్‌లైన్ కార్యకలాపాలంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ, అరెస్ట్ చేస్తామని భయపెట్టి ‘ఫైన్ అమౌంట్’ పేరిట యూపీఐ సహా ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, డిజిటల్ ఆధారాలు నశింపజేయాలనే ఉద్దేశంతో బాధితులకు మొబైల్ ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని కూడా ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో జాల సాయి రామ్ రెడ్డి (27) అనే యువకుడిని అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా రాపిడో రైడర్‌గా పనిచేస్తున్న ఇతను కరీంనగర్‌కు చెందినవాడిగా గుర్తించగా, స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల మండలం పులిగిల్ల గ్రామంగా పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.

ఒక కేసులో ఓ విద్యార్థిని వద్ద తాను సైబర్ క్రైం పోలీస్ అధికారినని బెదిరించి, పలుమార్లు డిజిటల్ లావాదేవీల ద్వారా మొత్తం రూ.97,540 మోసం చేసినట్లు గుర్తించారు. బాధితుడు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సాంకేతిక బృందాలతో చేసిన లోతైన దర్యాప్తులో నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 44 సైబర్ ఫ్రాడ్ పిటిషన్లు ఉన్నట్లు తేలింది. నమోదైన కేసులతో పాటు NCRP పోర్టల్‌లో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనేక సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలు, యూపీఐ స్కానర్లు ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మోసం చేసిన డబ్బును మళ్లించేందుకు స్థానిక దుకాణదారుల బ్యాంక్ ఖాతాలను తప్పుడు కారణాలతో వినియోగించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులుగా నటిస్తూ భయం సృష్టించి మోసాలకు పాల్పడే పునరావృత సైబర్ నేరగాడిగా అతడిని పోలీసులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఫోన్ కాల్స్ ద్వారా గానీ, యూపీఐ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా గానీ పోలీసులు ఎప్పుడూ డబ్బులు లేదా ఫైన్‌లు వసూలు చేయరని, అలాగే చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే భావన లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా NCRP పోర్టల్‌ను సంప్రదించాలని సూచించారు.