GHMC Free Water Scheme: ఇరవై వేల ఉచిత మంచినీటి పథకానికి గడువు పెంపు..!
జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వినియోగదారులు 20 వేల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేయనున్న సంగతి తెలిసిందే.
GHMC Free Water Scheme: జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వినియోగదారులు 20 వేల ఉచిత తాగునీటి పథకం కోసం కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు జలమండలి నగరంలోని వినియోగదారులకు 15 ఆగష్టు 2021 వరకు తాగునీరు, సీవరేజి బిల్లులను నిలిపివేసింది. పనిచేస్తున్న నీటి మీటర్లు కలిగిన డొమెస్టిక్ వినియోగదారులు 15 ఆగష్టు 2021 వరకు ఈ పథకం పొందేందుకు తమ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. ఇలాంటి వారికి ఆగష్టు నెల వరకు నీటి బిల్లుపై ఇరవై వేల లీటర్ల వరకు రిబేటు లభిస్తుంది. ఈ పథకానికి అర్హత పొందడానికి, వినియోగదారులు తమ క్యాన్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారి కనెక్షన్ కు పనిచేస్తున్న నీటి మీటర్ కలిగి ఉండాలి. డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు తమ కనెక్షన్లకు మీటర్ బిగించుకోవల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ పరిధి లోని మీటర్ కలిగిన బల్క్, ఎంఎస్బీ వినియోగదారులు ఫ్లాట్ వారీగా తమకు జీహెచ్ఎంసీ జారీ చేసిన PTIN నంబర్ నమోదు చేసుకుని, ఆధార్ లింక్ ను 15 ఆగష్టు 2021 లోగా పూర్తి చేసుకోవాలి. ఒక గృహ సముదాయంలో (అపార్ట్ మెంట్) ఎన్ని ఫ్లాట్ ల యజమానులు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఇరవై వేల లీటర్ల వరకు రిబేటు లభిస్తుంది. ఆధార్ అనుసంధానం చేయని మిగతా ఫ్లాట్ యజమానులకు యథావిధిగా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ఇరవై వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకానికి దరఖాస్తు చేయని వినియోగదారులందరూ.. ఆగష్టు 15 లోపు మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేసుకొని లబ్ధి పొందవచ్చని జలమండలి అధికారులు తెలిపారు. ఆగష్టు 15 తర్వాత కూడా ఈ పథకాన్ని పొందవచ్చని జలమండలి పేర్కొంది.ఇలాంటి వారికి 2020 డిసెంబర్ నెల నుంచి 31 ఆగష్టు 2021 వరకు నీటి బిల్లులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కాని, వీరు ఎలాంటి వడ్డీ, జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. వినియోగదారులు ఈ బిల్లులను సెప్టెంబర్ లోగా చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ కనెక్షన్లకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలంటే తమ దగ్గర్లో ఉన్న మీ-సేవా కేంద్రాల్లో గానీ, లేదా నేరుగా జలమండలి వెబ్ సైట్ www.hyderabadwater.gov.in ను సందర్శించి అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్ 155313 లో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.
Also Read: