Telangana High Court: ఆ సమయాల్లో 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దు: తెలంగాణ హైకోర్టు
16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశం, సమయవేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశం, సమయవేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షో, బెనిఫిట్ షోలకు అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వేళాపాలా లేని సినిమా షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతోపాటు.. ఇటీవల పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడంతో పాటు ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.
సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40 గంటల లోపు, తెల్లవారుజామున 1.30 తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించరాదంటూ పేర్కొన్నారు. పిల్లలను తెల్లవారుజామున, అర్థరాత్రి సమయంలో సినిమాలు చూడటానికి అనుమతించకూడదని తెలిపారు.
అయితే.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఆదేశించింది.. ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ప్రవేశాన్ని నియంత్రించడానికి అందరు స్టేక్ హోల్డర్లతో చర్చించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




